దక్షిణాదితో పోలిస్తే బాలీవుడ్‌లో సినీ కపుల్స్ ఎక్కువగా కనిపిస్తారు. వెంటనే పెళ్లిని పెటాకులు చేసుకున్న వారు కొందరైతే జీవితాంతం కలిసి జీవించిన వారు మరికొందరు. నాటి గురుదత్, దిలీప్‌కుమార్, అమితాబ్‌బచ్చన్, నర్గీస్, జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్, అభిషేక్‌బచ్చన్, కాజోల్, అజయ్‌దేవగణ్ వంటి ఎందరో ఈ కోవకి వస్తారు. ఈ కోవకి చెందిన జంటే దిలీప్‌కుమార్, సైరాభానులది. 1970వ దశకంలో వీరు ఓ వెలుగు వెలిగారు. రొమాంటిక్ కింగ్‌గా దిలీప్‌కుమార్ ఓ వెలుగు వెలిగితే, సైరాభాను యువతను కట్టిపడేసింది. వీరిద్దరు కలిసి 'భైరాగి, గోపి, సగినా' వంటి పలు రొమాంటిక్ బ్లాక్‌బస్టర్స్‌లో నటించారు. ఆ తర్వాత నిజజీవితంలో కూడా వారు వివాహం చేసుకుని ఒకటయ్యారు.
ఇక దిలీప్‌కుమార్, సైరాభానులకు వయో భారం కూడా పెరిగింది. ముఖ్యంగా ముసలి వయసులో ఉన్న దిలీప్‌కుమార్ ప్రస్తుతం కేవలం చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. ఆయన యోగక్షేమాలు చూసుకుంటూ సైరాభాను జీవితం గడుపుతోంది. ఇక వీరిద్దరు దాంపత్య జీవితంలో ఇప్పటివరకు పక్కన దిలీప్‌కుమార్ లేకుండా సైరాభాను ఎప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్లలేదట. కానీ తాజాగా తన స్నేహితుడు కుమార్తె వివాహానికి మాత్రం సైరా భాను ఒక్కతే హాజరైంది. జూన్29, 2018.. ఈ తేదీని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నా కోహినూర్ వజ్రమైన దిలీప్ లేకుండా ఒంటరిగా నేనెక్కడికి వెళ్లను. అలాంటిది ఆరోజు వివాహానికి ఒంటరిగా వెళ్లాను. కానీ పక్కన ఆయన లేరని ఎంతో బాధపడ్డాను. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలయ్యాను..అని చెప్పుకొచ్చింది.
ఇక ఆమె దిలీప్ ఆరోగ్యం గురించి చెబుతూ, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కోసం మీరు చేస్తున్న మెసేజీలు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ధన్యవాదాలు, నేను, దిలీప్ 52ఏళ్లుగా మీలాంటి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాం. మీతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా ముచ్చటిస్తూనే ఉన్నాం. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నా కోహినూర్ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకోండి.. అని సైరా భాను చెప్పుకొచ్చింది.