వినోద్.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవ్వరూ గుర్తు పట్టకపోవచ్చు గానీ ఆయన ఫొటోని చూస్తే మాత్రం ఠక్కున గుర్తుకొస్తాడు. తెలుగులో దాదాపు 300లకు పైగా చిత్రాలలో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హీరోగా కూడా నటించాడు. ముఖ్యంగా మూడు దశాబ్దాల కిందట మరో తెలుగు విలన్ బెనర్జీ, వినోద్‌లు కలిసి హీరోలుగా నటించిన 'నల్లత్రాచు' చిత్రం ఓ సంచలనం సృష్టించింది. కింగ్ కోబ్రా పాము నేపధ్యంలో వీరిద్దరు ఈ చిత్రంలో ప్రధాన విలన్లుగా లీడ్‌రోల్ పోషించారు. ఇక వెంకటేష్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'చంటి' చిత్రంలో మీనా అన్నయ్యలలో ఒకడిగా, నాజర్ తమ్ముళ్లలో ఒకడిగా ఆయన చూపిన విలనిజం అందరినీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత ఆయన 'ఇంద్ర, లారీడ్రైవర్' వంటి చిత్రాలతో పాటు స్టార్స్ నటించిన చిత్రాలలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. వాస్తవానికి ఆయనకు 'చంటి'నే టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ఈయన హీరోగా పలు చిత్రాలలో నటించాడు. గుంటూరుజిల్లా తెనాలికి చెందిన ఈయన అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. ఇలా హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈయన ఈరోజు అంటే శనివారం తెల్లవారుజామున 2గంటలకు బ్రెయిన్‌స్ట్రోక్‌తో మరణించడంతో చిత్ర పరిశ్రమ మొత్తం దిగ్బ్రాంతికి లోనైంది.
ఇక మొదటగా వి.విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన 'కీర్తి.. కాంతం.. కనకం' చిత్రంలో హీరోగా నటించాడు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని, దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీజోష్ కోరుకుంటోంది...!