వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకి సెంటిమెంట్, ఇతర ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి చిత్రాలంటే ఇష్టం లేదని గతంలో ఎన్నోసార్లు చెప్పాడు. ఏదైనా కాంట్రవర్శీ, యదార్ధ సంఘటనలు, మాఫియా నేపధ్యంలోనే ఆయన చిత్రాలు సాగుతూ ఉంటాయి. ఇక ఈయన పక్కా 'రా' చిత్రాలుగా వచ్చే వాటికి బాగా ప్రమోషన్ చేసి పెడతాడు. ఏదైనా పీక్స్‌లో ఉండాలనుకునే వర్మ అలాంటి చిత్రాలపై ప్రశంసల వర్షం కురిపించి ఆ చిత్రానికి కావాల్సిన ప్రమోషన్ చేసి పెడతాడు. దీనికి 'అర్జున్‌రెడ్డి'నే ఉదాహరణ.
ఈ చిత్రం విషయంలో వి.హన్మంతరావు పోస్టర్లను చించివేయడంపై, ఆ తర్వాత చిల్ తాతయ్య అంటూ విజయ్‌దేవరకొండ, నీకు ఆ హీరోయిన్ ముద్దు పెట్టకపోవడమే నీ కోపానికి కారణమా? అంటూ వర్మ కూడా అర్జున్‌రెడ్డికి వంత పాడాడు. ఆ తర్వాత ఆ చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రత్యేకంగా ముంబై వెళ్లి వర్మని కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, సందీప్ చెప్పిన రెండో చిత్రం విడుదలైతే, దాని ముందు 'అర్జున్‌రెడ్డి' చిత్రం ఫ్లాప్‌లా అనిపిస్తుందని చెప్పాడు. ఇక విషయానికి వస్తే వర్మ శిష్యుడైన అజయ్‌భూపతి దర్శకత్వంలో తాజాగా 'ఆర్‌ఎక్స్100' చిత్రం వచ్చింది.
ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ, ఈ చిత్రంపై, తన శిష్యునిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్‌ఎక్స్ 100ని చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్న దర్శకుడు అజయ్‌భూపతికి, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు శుభాకాంక్షలు తెలిపాడు. నటీనటులు కార్తికేయ, పాయల్‌పై ప్రశంసలు కురిపించిన వర్మ ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తోందని చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా మెగా ఫ్యామిలీ పై కూడా ఓ కౌంటర్ వదిలాడు. మెగా ఫోర్స్ 'విజేత' కాలేక చతికిల పడితే 'ఆర్‌ఎక్స్100' గర్జిస్తోంది అంటూ వర్మ ట్వీట్ చేశాడు. కాగా మంచి ఓపెనింగ్స్‌ని సాధించిన 'ఆర్‌ఎక్స్100' ప్రస్తుతం డివైడ్ టాక్‌తో నడుస్తోంది.