ఈ మధ్యన వెంకటేష్ గ్యాప్ లేకుండా సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తున్నాడు. నిన్నమొన్నటివరకు సినిమాలను లైట్ తీసుకుని ఐపీఎల్ అంటూ హడావిడీ చేసిన వెంకటేష్ తాజాగా సినిమాల విషయంలో సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. వరసగా సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. నిన్నగాక మొన్న వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా సెట్స్ మీదకెళ్ళిన వెంకటేష్ నిన్నటికి నిన్న తన మేనల్లుడు నాగ చైతన్య తో కలిసి మరో మల్టిస్టారర్ ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో సైలెంట్ గా మొదలు పెట్టేసాడు. ఈ సినిమాకి ఇప్పుడు పూజ కార్యక్రమాలు జరిగినా... సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుందట.
ఎందుకంటే నాగ చైతన్య 'సవ్యసాచి' సినిమాతోనూ, మారుతీ దర్శకత్వంలో వస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాల షూటింగ్ లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక వెంకటేష్ ఎఫ్ 2 తో పాటుగా త్రినాథ రావు కి మరో సినిమా కమిట్ అయ్యాడు. ఇక తేజ సినిమా ఎలాగూ ఆగిపోయింది అది వేరే విషయం. ఇక ఎఫ్ 2 లో వెంకీ సరసన మిల్కి బ్యూటీ తమన్నా నటిస్తుంది. తమన్నా కి క్రేజ్ తగ్గడంతో ఇలా సీనియర్ హీరోలకు ఓకే చెప్పేస్తుంది. ఆ మధ్య కాజల్ ని తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి వెంకటేష్ పక్కన తీసుకుందామనుకుంటే కాజల్ చెప్పిన రేటుకి నిర్మాతలకు కళ్ళు తిరిగాయి.
అందుకే కాజల్ జోలికి వెళ్లడమే మానేశారు వెంకీ నిర్మాతలు. ఇక నాగ చైతన్య - వెంకీ మల్టీస్టారర్ సినిమాకి 'వెంకీ మామ' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో చైతు అండ్ వెంకీ లు రియల్ లైఫ్ పాత్రలు అంటే... మామ అల్లుళ్లుగా నటించబోతున్నారని టాక్. నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ మరోసారి నటించనుంది. ఆ విషయాన్నీ రకుల్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. తాను వెంకీ - నాగ చైతన్య మల్టీస్టారర్ లో భాగమవుతున్నందుకు హ్యాపీ అంటూ ట్వీట్ చేసింది. ఇక మిగిలిన వెంకటేష్ కి ఇప్పుడు హీరోయిన్ కరువయ్యింది. వెంకీ సరసన నటించేందుకు సీనియర్ హీరోయిన్స్ ఎవరు కనుచూపుమేర కనబడటం లేదు. ఇక చివరికి వెంకటేష్ కి శ్రియా శరణ్ దిక్కవుతుందేమో. శ్రియ కి పెళ్లయిన... వరస బెట్టి సినిమాలు ఒప్పేసుకుంటుంది. చూద్దాం 'వెంకీ మామ' సినిమాలో వెంకీ సరసన ఎవరు నటించబోతున్నారో అనేది.