గత నాలుగేళ్ల కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించే క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రముఖులను కలుసుకుని బిజెపి సాధించిన విజయాలను వివరిస్తూ ఉన్నాడు. ఈ దశలో ఆయన సంపర్క్ సే సమర్దన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్‌షా తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో ఆయన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనిరాజు, షటిల్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ని కలిసి వారితో తమ విజయాలను వివరించనున్నాడు.
ఇక మిగిలిన ఇద్దరైన రామోజీరావు, సైనానెహ్వాల్‌ని కలవడంతో పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ లేకపోయినా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనిరాజుని అమిత్‌షా కలవడం మాత్రం ఆసక్తిని రేపుతోంది. గతంలో పవన్‌కళ్యాణ్ శ్రీనిరాజు తన తల్లిని అవమానించడం కోసం డబ్బులు ఖర్చుపెట్టి లోకేష్‌తో కుట్రపన్నారని పవన్ ఆరోపించాడు. దీనిపై శ్రీనిరాజు కూడా పరువు నష్టం కింద పవన్‌కు నోటీసులు పంపించి ఉన్నాడు. ఈ నేపధ్యంలో అమిత్‌షా-శ్రీనిరాజుల కలయికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు అమిత్‌షాకు తాజాగా తమిళనాడులో తీవ్ర సెగ తగిలింది. అమిత్‌షా తమ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలులేదని పలువురు తమిళులు ఆయనపై మాటల తూటాలు పేల్చారు.
ఇక ఏపీలో పరిస్థితి కూడా అలానే ఉంది. తాజాగా ఏపీ బిజెపి అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ నెల్లూరుకి వచ్చిన సందర్భంగా తమ జీవితాలను అతలాకుతలం చేసిన మోదీపై కోపంతో, ఏపీకి బిజెపి అన్యాయం చేసిందనే ఆవేశంతో ఓ వ్యక్తి కన్నాపైకి చెప్పులు విసిరిన సంఘటన సంచలనం సృష్టించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌షా ఏపీ యాత్ర ఎలా సాగనుందో కూడా వేచిచూడాల్సివుంది..!