ప్రస్తుతం తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సగం పెట్టుబడి బాలయ్యది కాగా, మిగిలిన భాగం వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి, విబ్రి సంస్థ అధినేత విష్ణు ఇందూరిలు భాగస్వామ్యం వహిస్తున్నారు. ఇక ఇందులో దగ్గుబాటి రానా, విద్యాబాలన్, కళ్యాణ్‌రామ్, హరికృష్ణ, కీర్తిసురేష్, మోహన్‌బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. మరోవైపు 'మహానటి'లో చక్రపాణిగా నటించిన ప్రకాష్‌రాజ్ ఇందులో బి. ఎన్.రెడ్డిలా కనిపించనుండగా, చక్రపాణి పాత్రను మురళీ శర్మ పోషిస్తున్నాడు.
మరోవైపు ఎన్టీఆర్ సరసన నాటి తరంలో ఎక్కువ చిత్రాలలో నటించిన ప్రముఖ హీరోయిన్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకోనున్నారని సమాచారం. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో నిర్మాత బి.ఎ.సుబ్బారావుది కీలక పాత్ర, ఎన్టీఆర్ అప్పటికే 'మనదేశం, షావుకారు' చిత్రాలలో నటించినా కూడా ఎన్టీఆర్‌ని పూర్తి స్థాయి హీరోని చేసిన ఆయన ఎన్టీఆర్ మూడో చిత్రంగా 'పల్లెటూరిపిల్ల'ని నిర్మించింది బి.ఏ.సుబ్బారావే. ఇక ఈ పాత్ర కోసం సీనియర్ నరేష్‌ని తీసుకున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ, సీనియర్ నరేష్‌ల మధ్య సన్నివేశాలను క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు క్రిష్ 'మణికర్ణిక'తో పాటు సమాంతరంగా ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. కంగనా రౌనత్‌కి గాయం, కొన్ని సీన్స్‌లు మరలా రీషూట్ చేయాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా ఉన్న క్రిష్ మణికర్ణిక రీషూట్స్‌ని ఎప్పుడు మొదలుపెడతాడో వేచిచూడాల్సివుంది..!