సాధారణంగా సినిమా రంగంలో ఇతర నటీనటులను వారికి పోటీగా ఉండే నటీనటులు పొగడడం చాలా అరుదు. ఈ ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్‌స్టార్స్ తో ప్రారంభం కావడం శుభ పరిణామం. రామ్‌చరణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు.. ఇలా అందరు తమకు ఇతరుల చిత్రాలు నచ్చితే ఓపెన్‌గా పొగిడేస్తున్నారు. ఇక ఆడవారిలో మగవారి కంటే అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. అందుకే ఈ పోటీ వాతావరణంలో తమకు పోటీ అయిన హీరోయిన్ గురించి రెండు మూడు పొగడ్తలు చేయడానికి కూడా తోటి హీరోయిన్స్ ఒప్పుకోవడం లేదు.
కానీ ఈ విషయంలో సమంత తన రూటే సపరేట్ అని నిరూపించుకుంటోంది. పెళ్లి అయినా కూడా హవా తగ్గని రేర్ హీరోయిన్‌గా పేరుపొందిన సమంత కోలీవుడ్‌లో తనకి గట్టి ప్రత్యర్ధి అయిన లేడీ సూపర్‌స్టార్ నయనతారను పొగడ్తలతో ముంచెత్తింది. సమంత ఈ ఏడాది ఇప్పటికే 'రంగస్థలం, మహానటి' తమిళంలో 'ఇరుబుదిరే' (తెలుగులో 'అభిమన్యుడు') చిత్రాల ద్వారా హ్యాట్రిక్ హిట్స్ సాధించింది. ప్రస్తుతం ఆమె కన్నడ రీమేక్‌గా తెలుగు, తమిళంలో రూపొందుతున్న 'యూటర్న్', విజయ్‌సేతుపతితో 'సూపర్‌డీలక్స్', శివకార్తికేయన్‌తో 'సీమ రాజా' వంటి చిత్రాలలో నటించింది. మరోవైపు ఆల్‌రెడీ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ని వివాహం చేసుకుందని, సహజీవనం చేస్తోందని నయనతారపై వార్తలు వస్తున్నాయి. అయినా ఆమె చేతినిండా చిత్రాలతో బాగా బిజీగా ఉండటం విశేషం.
తాజాగా ఈమె 'కొలమావు కోకిల' అనే డ్రగ్స్ నేపధ్యంలో సాగే చిత్రంలో నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఆరు పాటల్లో శివ కార్తికేయన్ ఓ పాట రాయగా, దర్శకుడు విఘ్నేష్ శివన్ కూడా ఈ చిత్రం ద్వారా పాటల రచయితగా మారాడు. ఇక తాజాగా శివ కార్తికేయన్ రచించిన 'కళ్యాణం వయసు...' అనే పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇక విడుదలైన టీజర్‌ని ఇప్పటికే 36లక్షల మంది వీక్షించడం విశేషం. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నానని తెలుసు. 'కొలమావు కోకిల' టీజర్ అద్బుతంగా ఉంది. చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు. నయనతార కీర్తి కిరీటాలలో ఈ చిత్రం డైమండ్ స్టోన్ గా నిలిచిపోతుందని తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తుండటం విశేషం. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.