తాజాగా థాయ్‌లాండ్‌కి చెందిన జూనియర్ ఫుట్‌బాల్ టీం అతి భయంకరమైన అడవులు, గుహలలోకి వెళ్లి ఆరునెలలు గడపాలని నిర్ణయించారు . కానీ అతి భయంకరమైన ప్రమాదకరమైన ఆ గుహలోకి ఉన్నట్లుండి వరదనీరు పీకల్లోతుకు రావడం, ఈ గుహలో దారులు మిస్టరీ కావడంతో ఈ జట్టు, వారి కోచ్ గుహలో ఇరుక్కుపోయారు. వీరిని రక్షించడం కోసం అమెరికాతో పాటు పలు దేశాలు సాయం ప్రకటించి డైవర్లను పంపాయి. ఇక ఇన్నిరోజులు ఆహారం లేక, ఆ బురద నీటినే తాగుతూ ఫుట్‌బాల్ టీం సభ్యులు క్షణమొక యుగంగా బతికారు. వీరికి కావాల్సినంత ధైర్యాన్ని వారి కోచ్ అందించాడు. నాటకీయ పరిణామాల మధ్య వారిని డైవర్లు కాపాడారు. ఈ క్రమంలో ఓ డైవర్ మృత్యువాత పడ్డారు. పిల్లలను రక్షించబోయి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు.
భయంకరమైన గుహ, చుట్టూ చిమ్మచీకటి, పీకల్లోతు వరదనీరు. గంటల కొద్ది గుహ నుంచి బయటకు రావాలని ప్రయాణం, భారీ వర్షాలు... ఇవ్వన్నీ వింటే మనకు నిజంగానే ఓ హాలీవుడ్ సాహస చిత్రం కళ్లముందు కదలాడుతుంది. దీంతో ఈ డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్‌ని ఆంగ్ల చిత్రంగా హాలీవుడ్‌లో తీయాలని ఓ నిర్మాణ సంస్థ భావిస్తోంది. ప్యూర్‌ఫ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, కావోస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ఆడమ్ స్మిత్‌తో పాటు ఈ కథను చిత్రంగా తీయాలని భావిస్తున్నామని ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సీఈవో మైఖేల్ స్కాట్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించాడు. దీనికోసం 60 మిలియన్ డాలర్లు అంటే సుమారు 400కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ వాస్తవ కథ హక్కులను తాము సంపాదించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపిన ఆయన ఈ కథలో సాహసం, హీరోయిజం, ఎమోషన్స్ వంటివన్నీ ఉన్నాయని, ఇప్పటికే ఈ రెస్క్యూలో పాల్గొన్న 90మంది డైవర్స్‌తో మాట్లాడామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అశువులు బాసిన డైవర్‌కి నివాళిగా ఈ చిత్రాన్ని అంకితమివ్వనున్నామని ఈయన తెలిపారు.