స్వామి వివేకానంద నుంచి మన పురాణాలు, భగవద్గీత వంటివన్నీ 'భయం మనిషికి మరణం. ధైర్యమే ఆయుధం' అని చెబుతున్నాయి. భయంతో ఉంటే తాడుని కూడా పాము అని భ్రమించి చనిపోతాం. అదే మనోధైర్యం ఉంటే పాము కరిచినా బతికి బయటపడతాం. భయం అనేది మరణం,.. మనోధైర్యమే సకల రోగాలకు విరుగుడు అని చెప్పి ఉన్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడే వారికి ఆ మనోధైర్యం, వారి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, అభిమానులు ఇచ్చే దైర్యమే వారిని కోలుకునేలా చేస్తుంది. ఇలా మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చి నిండు నూరేళ్లు బతికిన వారు ఉన్నారు.
ఇక క్యాన్సర్ విషయానికి వస్తే ఆరోగ్యకరమైన, బలవర్దక ఆహారం, నియమం తప్పకుండా మందులు, మనోధైర్యం ఉంటే క్యాన్సర్‌ని కూడా జయించిన వారుగా యువరాజ్‌సింగ్, లీసారే, గౌతమి వంటి ఎందరో ఉదాహరణగా నిలుస్తారు. ఇక ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటి సోనాలిబింద్రే తాజాగా తనకి హైగ్రేడ్ క్యాన్సర్ సోకిందని తెలిపింది. తీవ్ర స్థాయిలో శరీరం అంతా పాకిన క్యాన్సర్ కోసం ఆమె అమెరికాలోని న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. తనపైఅందరు కురిపిస్తున్న ఆప్యాయత పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, ఉద్వేగ భరితమైన వ్యాఖ్యలు చేసింది.
నా అభిమాన రచయిత ఇసబెల్ అలెండే. ఆయన ఓ విషయాన్ని రాశారు. మనలో దాగి ఉన్న శక్తిని మనం బలవంతంగా బయటకు తీసుకుని వచ్చేవరకు మనం ఎంత శక్తిమంతులమో మనకే తెలియదు అని ఆయన చెప్పారు. కష్టకాలంలో మనిషి ఏ పని చేయడానికైనా తెగిస్తాడు. కష్టాలను తట్టుకుని మనుగడ సాగించగలిగే అద్భుతమైన సామర్ధ్యం మనిషి సొంతం. నాకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి స్నేహితులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు అండగా నిలుస్తున్నారు. నాపై ఎనలేని ఆదరాభిమానాలు చూపిస్తూ నాకు మనోధైర్యం ఇస్తున్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సోనాలిబింద్రే చెప్పుకొచ్చింది.