ఇద్దరు విలక్షణ నటులు ఒకే పాత్రలో నటించినప్పుడు వారి మద్య నటనలో పోలిక రావడం సహజం. పాత చిత్రాలను రీమేక్స్ చేసినప్పుడు కూడా ఒరిజినల్ చిత్రానికి, తాజా రీమేక్‌కి పోలికలు తీస్తారు. ఇక విషయానికి వస్తే ఇటీవల సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' చిత్రం విడుదలై ఎవరు కనివిని ఎరుగని విజయం సాధించింది. ఈ చిత్రంలో బి.యన్.రెడ్డి, చక్రపాణిల పాత్రలు కూడా ఉన్నాయి. విజయా సంస్థపై ఎన్నో బ్లాక్‌బస్టర్స్ నిర్మించిన బి.ఎన్.రెడ్డి, చక్రపాణిలలో చక్రపాణి పాత్రను ప్రకాష్‌రాజ్ పోషించి మెప్పించాడు.
ఇప్పుడు తాజాగా బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. ఇందులో కూడా చక్రపాణి పాత్ర ఉంటుంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎవ్వరూ మర్చిపోలేని హిట్‌ని ఇచ్చిన చిత్రమైన 'పాతాళభైరవి' చిత్రం గురించి, ఆ చిత్ర సమయంలో జరిగిన సంఘటను కూడా ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో చక్రపాణి పాత్రను మురళీశర్మపోషించనున్నాడు. వాస్తవానికి ప్రకాష్‌రాజ్, మురళీశర్మ ఇద్దరు అద్బుతమైన విలక్షణ నటులే. ఒకే పాత్రను వారిద్దరు పోషిస్తుండటం కాకతాళీయమే కావచ్చు.
కానీ ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన తర్వాత మాత్రం ప్రకాష్‌రాజ్, మురళీశర్మల నటనల మద్య పోలికలు రావడం సహజమేనని చెప్పాలి. మరి వీరిద్దరిలో ఎవరు ప్రేక్షకులను ఆ పాత్ర ద్వారా ఎక్కువగా మెప్పిస్తారనేది వేచిచూడాల్సివుంది..!