ఒకప్పుడు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, వారి మధ్య బంధాలు, ఉత్తరాలు ఆప్యాయంగా రాసుకోవడం, ఒకే కుటుంబంలో ఉంటూ ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉండటం జరిగేవి. కానీ నేటి రోజుల్లో మాత్రం సాంకేతిక విప్లవం పుణ్యమా అని మనిషికో మొబైల్ ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్... ఏం జరిగినా వెంటనే వాటిని చూసే సౌలభ్యం, పక్క గదిలో ఉన్నవారికి కూడా ఫోన్ చేయడం, లేదా ఫేస్‌బుక్, ట్విట్టర్, మెసేజ్‌లు, మెయిల్స్ చేయడం వంటి పద్దతి వచ్చేసింది. సమాజంలోని ఇతరులతోనే కాదు.. మన ఇంట్లోని వారి మధ్య కూడా పలకరింపులు తక్కువే. అంతా మొబైల్, కంప్యూటర్ మహత్మ్యం.
దీనినే బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ ఒకే ఒక్క ఫొటోతో చూపించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆలోచింపజేస్తోంది. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయాన్నిఈ ఫొటో అద్దం పట్టింది. అందరి చేతా ఔరా అనిపించే ఈ ఫొటోకి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. అమితాబ్ షేర్ చేసిన ఫొటోలో అమితాబ్ కుటుంబం అంతా ఒకే గదిలో ఉంది. అభిషేక్‌బచ్చన్, చిన్నారులు శ్వేతాబచ్చన్ నందా, మనవళ్లు నవ్యా నావెలి నందా, అగస్త్య తదితరులు ఉన్నారు. ఇలా అందరు ఒకే రూంలో ఉన్నా నిశ్భబ్దం రాజ్యమేలుతోంది. కారణం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఎవరికి వారు వాటిని చూస్తూ అందులో లీనమైపోయారు.
ప్రపంచాన్ని, పక్కన ఉండే వారిని కూడా మైమరిచిపోయి ఫోన్‌లో దూరిపోయారు. ఈ ఫొటోని పోస్ట్ చేసిన అమితాబ్.. అందరూ ఒక చోటే ఉన్నారు. వారితో ఫోన్లు కూడా ఉన్నాయి. అని అమితాబ్ తన ఫొటోకి క్యాప్షన్ కూడా రాశాడు. అయితే అందరూ స్మార్ట్ ఫోన్లులో మునిగిపోయి ఉంటే నవ్యా మాత్రం కాస్త బెటర్ అన్నట్లుగా పుస్తకం చదువుతూ అందులో లీనమైపోయింది. పెరుగుతున్న సాంకేతిక మనుషులను మౌన మునులుగా మార్చుతోందనడానికి ఇదో ఉదాహరణగా చెప్పవచ్చు.