తనను డైరెక్ట్ చేసే దర్శకుల ప్రతిభ చూసి చిరాకొచ్చిందో లేక తన తాజా చిత్రాలన్నీ డిజాస్టర్లుగా నిలవడం చూసి హీరోగా కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకోవాలనుకొన్నాడో తెలియదు కానీ.. ఉన్నట్లుండి డైరెక్టర్ అవతారమెట్టాడు రాహుల్ రవీంద్రన్. ఇన్నోసెంట్ మరియు చాక్లెట్ బోయ్ రోల్స్ కి ప్రసిద్ధుడైన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ కొత్త నిర్మాణ సంస్థ 'చి ల సౌ' అనే సినిమాను మొదలెట్టగా.. మొన్నామధ్య విడుదలైన టీజర్ అందర్నీ అలరించింది. సుశాంత్ నటిస్తున్న ఆ చిత్రం అవుట్ పుట్ నచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఆ చిత్రాన్ని బ్యాకింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సీన్ లోకి ఎంటరవ్వడంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
అయితే.. తాజా సమాచారం ప్రకారం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభను మెచ్చిన నాగార్జున అండ్ కో దర్శకుడిగా రాహుల్ సెకండ్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చిందట. ఈ విషయాన్ని రాహుల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. సాధారణంగా కొత్త దర్శకులకు అవకాశాలివ్వడానికి ఒకటికి పది సార్లు ఆలోచిందే అన్నపూర్ణ సంస్థ.. రాహుల్ కి ఇలా బ్యాక్ టు బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం పట్ల ఇండస్ట్రీలో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. సమంతతో ఉన్న సాంగత్యం కూడా ఇందుకు సహకరిస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా హీరోగా ఫెయిల్ అయిన రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ అవుతుండడంతో.. ఇకపై దర్శకుడిగానే కంటిన్యూ అవుతాడో లేక మళ్ళీ హీరోగా ఏదైనా ప్రయత్నం చేస్తాడో చూడాలి.