బయోపిక్‌లకు కథా వస్తువు, మెయిన్‌లైన్ ఈజీగా తయారవుతుంది. కానీ ఆ తర్వాత ఆయా నిజ జీవితంలోని సంఘటనలకు నాటకీయత, సినిమాటిక్ టచ్ ఇవ్వడం కాస్త కష్టమైన పని. ఆ పని చేయగలిగి, డ్రమటిక్‌గా, అన్ని కమర్షియల్ అంశాలు జోడించి, మూలకథను డైవర్ట్ చేయకుండా తీస్తే బయోపిక్‌గా బ్రహ్మాండంగా ఆడుతాయని ఇప్పటికే నిరూపితం అయింది. ఇక మామూలు చిత్రం అయితే కథ కోసం బాగా ఖర్చుపెట్టడం, లేదా రచయితల చేత రెమ్యూనరేషన్ ఇప్పించి రాయించడం వంటి వాటికి కూడా భారీగానే డబ్బు వెదజల్లాలి. అదే బయోపిక్‌ల విషయానికి వస్తే మాత్రం ఆయా మూలకథల నిజమైన వ్యక్తులకు, వారు బతికి లేనప్పుడు వారి వారసులకు ఇంత రాయల్టీ కింద కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 'మహానటి' విషయంలో లాగా సావిత్రి కొడుకు కూతుర్లకి పది పైసలు ఇవ్వకుండా కూడా జాక్‌పాట్ కొడతారు.
ఇక ఈ బయోపిక్‌ల మీద పలు విమర్శలు కూడా ఉన్నాయి. చాలా బయోపిక్ చిత్రాలు నిజజీవితాలకు వాస్తవ దూరంగా ఉంటున్నాయని విమర్శలు చెలరేగుతున్నాయి. ఇక విషయానికి వస్తే 'అజర్, ధోని, సచిన్' చిత్రాల బయోపిక్‌లకు వారికి ఆయా నిర్మాతలు భారీ మొత్తాలనే చెల్లించారు. ఇక తాజాగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ఖల్‌నాయక్ సంజయదత్ బయోపిక్‌గా 'సంజు' చిత్రం రూపొంది మొదటి వారంలోనే 200కోట్లు వసూలు చేసి 300కోట్ల దిశగా సాగుతోంది. ఇందులో సంజయ్‌దత్‌గా నటించిన రణబీర్‌కపూర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇక బయోపిక్ లంటే చాలా మంది తమ జీవితంలో తాము చేసిన చెడును చూపించడానికి అంగీకరించరు. కానీ ఈ విషయంలో సంజయ్‌దత్ గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే. ఇక తన కథను బయోపిక్‌గా తీయడానికి రాజ్‌కుమార్ హిరాణి సంజయ్‌దత్‌కి 10కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు లాభాలలో కూడా వాటా ఇస్తానని హామీ ఇచ్చాడట. ఈ విధంగా చూసుకుంటే లాభాలలో వాటా ద్వారా కూడా సంజయ్‌కి భారీగా ఆదాయం లభించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈచిత్రాన్ని విదు వినోద్‌చోప్రా, రాజ్‌కుమార్ హిరాణిలు సంయుక్తంగా నిర్మించారు.