తన కెరీర్‌ని మొదలు పెట్టినప్పటి నుంచి తన ట్వీట్స్, కామెంట్స్, సినిమాల ద్వారా నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. ఇన్నేళ్ల ఆమె కెరీర్‌లో ప్రతి నిత్యం ఆమెకి సంబంధించిన వార్త ఏదో ఒకటి హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. నాగచైతన్యతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, పెళ్లి తర్వాత నటిస్తుందా? అక్కినేని ఫ్యామిలీ అందుకు ఒప్పుకుంటుందా? చైతు ఓకే అంటాడా? ఇలా బోలెడు వార్తలు వచ్చాయి. అయినా ఈమె వేటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. 'రంగస్థలం'లో అయితే రామ్‌చరణ్‌కి ఏకంగా ముద్దు ఇచ్చి వృత్తి వృత్తే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగతమే అని చాటింది. పెళ్లయిన మూడోరోజు నుంచే 'రాజుగారి గది 2' ప్రమోషన్లలో బిజీ అయింది.
కాగా ప్రస్తుతం ఆమె పవన్‌కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో కన్నడలో సూపర్ బ్లాక్‌బస్టర్ అయిన 'యూటర్న్' రీమేక్‌లో నటిస్తోంది. దీనితో పాటు విజయ్‌సేతుపతితో 'సూపర్‌డీలక్స్, శివకార్తికేయన్, సీమరాజా' చిత్రాలతో పాటు తన భర్త నాగచైతన్యతో కలసి 'నిన్నుకోరి' దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది. ఇక సమంత సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ తన స్నేహితులు, సన్నిహితులు, సినిమా వారి ట్వీట్లకు తప్ప మిగిలిన వారి ట్వీట్టను పట్టించుకోవడం లేదట. దాంతో ఈమె వీరాభిమానికి ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది. వేల ట్వీట్స్ చేశాను. కానీ ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు... అని మండిపడ్డాడు. అదే సమయంలో అయినా మీపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు.. ఐ లవ్యూ అని డేర్‌గా చెప్పేశాడు.
దాంతో షాక్ కావడం సమంత వంతైంది. తర్వాత నాకు వెయ్యికి పైగా ట్వీట్స్ చేసినందుకు కృతజ్ఞతలు.. అని ఆమె ఆ అభిమానికి రిప్లై ఇచ్చింది. సమంత తనకు ట్వీట్ చేయడంతో ఆ అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశాడు. నేను జయించాను. ఏదో సాధించానని అనుభూతి కలుగుతోందని సంబరపడిపోయాడు. పాపం అభిమానులు అంతే.. అల్ప సంతోషులు.