ఎన్నోచిత్రాలలో చిన్నచిన్న పాత్రలు చేసి ఎట్టకేలకు 'పెళ్లిచూపులు' చిత్రంతో హీరోగా హిట్‌కొట్టి, ఆ తదుపరి వచ్చిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం ద్వారా సంచలనం సృష్టించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు విజయ్‌దేవరకొండ. 'అర్జున్‌రెడ్డి' చిత్రం చూసిన ఎవరైనా సరే ఆయన నటనకు మంత్రముగ్దులు కావడమే కాదు.. ఆయన్ను విజయ దేవరకొండ బదులు అర్జున్‌రెడ్డి అని సంబోధించినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఆయన బన్నీవాసు నిర్మాతగా, గీతాఆర్ట్స్2 బేనర్లు కలిసి సంయుక్తంగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గీతాగోవిందం' చిత్రంలో నటిస్తున్నాడు. కన్నడలో 'కిర్రాక్‌పార్టీ' ద్వారా సంచలనం సృష్టించి, తెలుగులో 'ఛలో' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిమితమైన క్రేజీ బ్యూటీ రష్మికమండన్న ఇందులో విజయ్ సరసన నటిస్తోంది.
గీత, గోవింద్ అనే ఇద్దరి మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని మొదటి పాటను 10వ తేదీ ఉదయం 11.50నిమిషాలకు విడుదల చేయనున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన రష్మికతో బైక్ మీద ఉన్న పోస్టర్‌ని విడుదల చేశాడు. 'ఇంకేం.. ఇంకేం.. ఇంకేం కావాలే' అని సాగే ఈ అందమైన పాట చక్కగా ఉంటుందని, దీనిని మరలా మరలా వింటారని తెలిపాడు. కొన్నిసార్లు అమ్మాయిలకు ఇంకేం కావాలో.. వారికోసం మనం ఇంకేం చేయాలో కూడా అర్ధంకాదు' అని ఆయన తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.
మరోవైపు గీతాఆర్ట్స్2, బన్నీవాసు భాగస్వామ్యంలోనే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోంది. దీని కంటే ముందే 'గీతాగోవిందం' విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు విజయ్ 'నోటా', 'డియర్ కామ్రెడ్'తో పాటు మైత్రిమూవీమేకర్స్ నిర్మాణంలో కూడా ఓ చిత్రంలో నటించనున్నాడు.