నిన్నటితరం కథానాయికల్లో కె.ఆర్.విజయది ప్రత్యేకమైనస్థానం. ఆమె కన్ను, ముక్కు తీరు, మరీ ముఖ్యంగా ఆమె నవ్వు ఆబాలగోపాలాన్నీ సమ్మోహన పరిచేవి. ఈమె సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక చిత్రాలలో కూడా తన సత్తా చాటింది. అయితే మిగిలిన చిత్రాలకంటే ఆమెకి పౌరాణిక చిత్రాలలోనే ఎక్కువ పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఏదైనా చిత్రంలో దేవతగా నటించాలంటే అందరు వెంటనే కె.ఆర్.విజయ ఇంటి ముందు క్యూ కట్టేవారు.
ఈమె తాజాగా మాట్లాడుతూ..ఎన్టీఆర్ గారికి చాలా ఓపిక ఎక్కువ. బరువైన కిరీటం, నగలు ధరించి కూడా తన షాట్ కోసం ఎన్నో గంటలు ఎదురుచూస్తూ ఉండేవారు. ఆ సమయంలో నాకు కాస్త నిద్ర వస్తే వెంటనే 'విజయా గారు.. విజయగారు' మీ సీన్ వచ్చింది. బాగా నటించమని ప్రోత్సహించేవారు. ఇక నేను ఏయన్నార్‌తో కూడా పలు చిత్రాలలో నటించి ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. నాకు 'శ్రీకృష్ణపాండవీయం'లో రుక్మిణీదేవి పాత్రను పోషించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం బాగా హిట్ కావడం, నాకు మంచిపేరు రావడంతో అందరు నన్ను దేవత పాత్రలకే అడిగేవారు.
ఇక నేను వ్యాపారవేత్త, నిర్మాత వేలాయుధంను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాడే ఆయనకు సొంతగా ఓ విమానం, షిప్పు ఉండేవి. అయితే నేను ఆయన ఆస్తిని చూసి చేసుకోలేదు. ఆయన మంచి మనసు, మంచితనం నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చింది.