మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అంటే ఆయన పాత్ర కోసం దేనికైనా తెగిస్తారు. నటించడం కాదు జీవిస్తాడు. ఈ విషయంలో ఆయన తెలుగులో నటించిన కె.విశ్వనాథ్ చిత్రం 'స్వాతికిరణం'తోనే అర్ధమైంది. ఓ ముస్లిం అందునా మలయాళీ అయి ఉండి సంగీత ప్రధాన చిత్రంలో అందునా కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఈయన నటించిన ఈ చిత్రంలో తన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకోవడం గొప్ప సాహసం. మరలా ఇంతకాలానికి మమ్ముట్టి మరోసారి అదిరిపోయే పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహాప్రస్దానమైన పాదయాత్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న 'యాత్ర' చిత్రంలో వైఎస్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఆనందోబ్రహ్మ' దర్శకుడు మహి.వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ బ్యాగ్రౌండ్‌లో తన పాదయాత్ర గురించి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడే మాటలతో ప్రారంభమంది. 'తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది. వాళ్లతో కలిసి నడవాలని ఉంది. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది..' అనే డైలాగ్స్ ఈ టీజర్ లో వున్నాయి.
ఇక వైఎస్ తరహాలోనే మమ్ముట్టి కూడా వైయస్‌ఆర్.. వైయస్సార్ అనేనినాదాల మద్య ఎడమచేయి పైకెత్తి అభివాదం చేస్తూ ఉన్నాడు. పంచెకట్టులో రాజన్నని తలపిస్తూ, అదే దరహాసం, అదే అభివాదంతో మమ్ముట్టి మ్యాజిక్ చేశాడు. ఇక ఈ టీజర్‌కి నేపధ్యసంగీతం మరో ఆకర్షణగా నిలిచింది. ఈటీజర్‌ని చూస్తేనే దీనికోసం యూనిట్ పడిన కష్టం అర్ధమవుతోంది. ఇక ఈ టీజర్ ఇప్పటికే లక్షల్లో దూసుకెళ్లుతోంది..!