జూన్ నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో డబ్బింగ్ సినిమాలు పక్కన పెడితే స్ట్రెయిట్ సినిమాలు 15 రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో ఏ సినిమా అంతగా ఆడలేకపోయింది. అలానే జూలైలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆల్రెడీ షెడ్యూల్ అయిన చాలానే సినిమాలు ఉన్నాయి.
జూలై మొదటి వారంలో గోపీచంద్ 'పంతం' మూవీతో పాటు సాయి ధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యు' సినిమాలతో పలకరించారు. అయితే ఆ సినిమాలు అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేదు. ఇక వచ్చే వారం మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తొలి చిత్రం ‘విజేత’తో పాటు ప్రోమోస్, టీజర్స్ తో జనాల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’ మరియు కార్తీ నటించిన తమిళ డబ్బింగ్ మూవీ 'చినబాబు' విడుదల అవ్వబోతున్నాయి.
జూలై 20న ఆల్రెడీ మూడు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. అందులో మెయిన్ గా దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న 'లవర్' మూవీ. ఇందులో రాజ్ తరుణ్ హీరో. కరెక్ట్ గా అదే రోజు మంచు లక్ష్మి నటించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ కూడా పోటీగా తయారైంది. అంతేకాకుండా 20న ‘ఆటగదరా శివ’ అనే చిన్న సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను కొత్తవాళ్లతో చంద్రసిద్ధార్థ తెరకెక్కించాడు.
ఇక జూలై చివరి వారంలో కొంచెం మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'సాక్ష్యం' తో పాటు కొణిదెల వారి అమ్మాయి నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్ ’ను కూడా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ నెలకి ఫిక్స్ అయిన సినిమాలు ఇవి. ఇవి కాకుండా రెండుమూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది.