'బాహుబలి' తర్వాత రాజమౌళి ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి ఇద్దరు నిజమైన యంగ్‌స్టార్స్‌తో ఏనాడో ఆగిపోయిన అసలు సిసలైన మల్టీస్టారర్స్‌కి మరలా తెలుగులో శ్రీకారం చుడుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయం బయటికి వచ్చినా అది నిజమో? కాదో? అనేది తెలియకుండానే వైరల్‌గా మారుతోంది. ఇక దీనిని 250కోట్ల రూపాయలతో డివివి దానయ్య తన డివివి ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించనున్నాడు. ఇది బాక్సింగ్ నేపధ్య చిత్రమని, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాపే గానీ బాక్సింగ్ నేపధ్యం కాదని, ఇక ఇందులో రామ్‌చరణ్ ఎన్టీఆర్‌లు అన్నదమ్ములుగా నటిస్తున్నారని ఇప్పటికే పలు వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇక ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఈ మూవీ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానున్నదట. 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకుని, చిత్రాన్ని కూడా దసరాకి విడుదల చేసిన వెంటనే ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్ అవుతాడట. ముందుగా ఎన్టీఆర్‌కి సంబంధించిన సోలో సీన్స్ చిత్రీకరణను పూర్తి చేసిన రాజమౌళి ఆ తర్వాత డిసెంబర్ నుంచి బోయపాటి శ్రీను చిత్రం పూర్తి చేసుకునే రామ్‌చరణ్‌పై సోలో సీన్స్‌ని తీస్తాడని, ఆపై ఇద్దరి కాంబినేషన్స్‌లో సీన్లను జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదట్లో మొదలుపెడతాడని సమాచారం.
ఈ చిత్రం కోసం అవసరమయ్యే భారీ సెట్స్ నిర్మాణం కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల సరసన నటించే హీరోయిన్లు ఎవరు? అనే విషయంలో ఆసక్తికర చర్చసాగుతోంది.