పవన్‌కళ్యాణ్ ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి కూడా సిద్దమేనని గతంలో ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఆయన ఆ ఊసే మరిచాడు. తాజాగా ప్రత్యేకహోదా-విభజన హామీల అమలు కోసం ఆయన తన కార్యకర్తలతో కలిసి వైజాగ్‌లోని ఆర్కేబీచ్‌లో నిరసన కవాత్తు నిర్వహించాడు. ఈ కవాత్తు కాళీమాత ఆలయం నుంచి ఉడా పార్క్ వరకు జరిగింది. ఇక తాజాగా పవన్ తన వల్ల అశోక్ గజపతిరాజు గెలిచాడనేట్లుగా మాట్లాడటం దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. గజపతిరాజులు తెలుగుదేశాన్ని స్థాపించిన 1983 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. కేవలం ఒక్కసారి మాత్రమే వారు ఓటమి పాలయ్యారు. దాంతో అశోక్ గజపతిరాజు పవన్ వల్ల గెలవడం ఏమిటనే విమర్శలు సహజంగానే వినిపించాయి.
దీనిపై తాజాగా పవన్ స్పందించాడు. నిజమే మీరు రాజు.. సంస్థానాధీశులు, పెద్దవాళ్లు.. నేనేమీ కాదనడం లేదు. నేను సామాన్యుడిని. ఓ కానిస్టేబుల్ కుమారుడిని. నేను అశోక్ గజపతిరాజు గురించి ఒక్క మాట కూడా అనలేదు. కేవలం స్పెషల్ స్టేటస్ గురించి మాత్రమే మాట్లాడాను. వాడెవడో పవన్‌కళ్యాణ్ అట.. యాక్టరంట... వాడెవడో నాకు తెలియదని అశోక్ గజపతిరాజు అన్నారు. అయినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను భరిస్తా. నేను ఉద్దానంలో దీక్ష చేస్తే అశోక్ గజపతిరాజు నేను రిసార్ట్స్‌లో నిరాహారదీక్ష చేశానని వ్యాఖ్యానించాడు. అందరి ముందు కూర్చుని నేను దీక్ష చేశాను. రిసార్ట్స్‌లో కాదు.
అది ఆయనకు తెలియకపోతే నేనేమి చేయలేను. టిడిపి నాయకులు బరువు తగ్గడానికి నిరాహారదీక్షలు చేస్తారంట. వారికి నిరాహార దీక్షలంటే అంత చులకనగా ఉందని పవన్ మండిపడ్డాడు. మరి కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా కోసం పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేసేది ఎప్పుడో?