'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం. ఒకవైపు రామ్‌చరణ్ 'రంగస్థలం' బ్లాక్‌బస్టర్‌తో ఊపు మీదుంటే దానయ్య 'భరత్ అనే నేను' ద్వారా, ఇందులో హీరోయిన్‌గా నటిస్తోన్న కైరా అద్వానీ కూడా 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా ఊపు మీదున్నారు. ఇక ఈ చిత్రంలో స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, వివేక్ ఒబేరాయ్ వంటి వారు కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదలయ్యేది వచ్చే సంక్రాంతికే అయినా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికీ మెయిన్ టాకీపార్ట్‌ని పూర్తి చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి రామ్‌చరణ్, విలన్ వివేక్ ఒబేరాయ్‌ల మీద క్లైమాక్స్ ఫైట్‌ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌లీడర్' తరహాలో ఉంటుందని తెలుస్తోంది.
ముఖ్యంగా అన్నా వదినల సెంటిమెంట్ ఈ చిత్రం హైలైట్స్‌లో ప్రధానంగా చెబుతున్నారు. ఈనెల 10 నుంచి మొదలుపెట్టే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి కాగానే యూనిట్ విదేశాలకు వెళ్లనుంది. అక్కడ హీరో రామ్‌చరణ్, హీరోయిన్ కైరా అద్వానీలపై పాటలను చిత్రీకరించనున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్‌ని బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. 'సరైనోడు' చిత్రం తర్వాత 'జయజానకి నాయికా' చిత్రం అనుకున్న స్థాయిలో కమర్షియల్‌గా హిట్ కాకపోవడంతో బోయపాటి శ్రీనుకి ఈ చిత్రం కీలకంగా మారింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తిచేసి రామ్‌చరణ్ రాజమౌళి చిత్రంలో జాయిన్ అవుతాడు. ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ'ని పూర్తి చేసి దసరాకి సినిమాని విడుదల చేసి రాజమౌళి చిత్రంతో కలుస్తాడు.
మొత్తానికి ఎన్టీఆర్ దసరాకే రానుండగా, రామ్‌చరణ్ మాత్రం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌ని ఢీకొట్టడానికి సంక్రాంతి పోరులోకి దూకుతున్నాడు. ఇక రాజమౌళి చిత్రం విషయానికి వస్తే ముందుగా షూటింగ్‌లో జాయిన్ అయ్యే రామ్‌చరణ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తాడని, ఆ తర్వాత ఎన్టీఆర్ వంతు వస్తుందని తెలుస్తోంది.