గత కొంతకాలంగా హీరో సూర్య, ఆయన సోదరుడు కార్తీకి అనుకున్న స్థాయిలో హిట్స్ లేవు. అయితే ఈ విషయంలో అన్నయ్య సూర్య కంటే తమ్ముడు కార్తి కాస్త బెటర్ అనే చెప్పాలి. కార్తి నటించిన 'ఖాకీ' చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఓకే అనిపించింది. ప్రస్తుతం కార్తీ తొలిసారిగా గ్రామీణ యువకునిగా పాత్రను పోషిస్తూ ఓ చిత్రం చేస్తున్నాడు. అదే 'చినబాబు'. కార్తీ హీరోగా 'అఖిల్' బ్యూటీ సాయేషా సైగల్‌తో పాటు కట్టప్ప సత్యరాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సమకాలీన రైతుల సమస్యలు, వాటి వెనుక వున్న రాజకీయాలు, వాస్తవ సంఘటనలను కూడా చూపించనున్నారు.
ఇక ఇందులో నేటి వ్యవస్థపై, రాజకీయాలపై కూడా ఘాటైన సెటైర్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌లో కార్తి చెప్పిన డైలాగ్‌లు పలువురిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ ద్వారా ఈ చిత్రంలో కుటుంబ విలువలకు పెద్ద పీట వేసినట్లు అర్ధమవుతోంది. ట్రైలర్ మొత్తం గ్రామీణ వాతావరణంలో నడవడంతో సినిమా కూడా పూర్తి గ్రామీణ బ్యాక్‌డ్రాప్ అనే విషయం తెలుస్తోంది. ఇప్పుడు బలం చూపించే వాడు బలవంతుడు కాదు... అమ్మాయిలు మనవాళ్లు... అబ్బాయిలు వేరేవాళ్లు అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం, ద్వారకాక్రియేషన్స్ బేనర్ల భాగస్వామ్యంలో హీరో సూర్య, మిర్యాల రవీందర్‌రెడ్డి దీనిని సంయుక్తంగా నిర్మించారు. డి.ఇమాన్ సంగీతం వహించిన ఈ చిత్రంలో శత్తువిలన్ పాత్రను పోషించాడు. త్వరలో ఆడియోను విడుదల చేసి వీలైనంత తొందరగా సినిమాను థియేటర్లలోకి తేవాలని చూస్తున్నారు.