తోటి నటీనటులకు సహకరిస్తూ, వారికి ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే స్పందించే స్టార్‌గా నాగార్జునకు మంచి పేరుంది. అందుకే పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం తమకు తెలుగులో నాగార్జున అంటే ఇష్టమని, ఆయనో జెంటిల్‌మేన్ అని చెబుతూ ఉంటారు. దక్షిణాదిలో సెలక్టివ్‌గా చిత్రాలు చేసే ఐశ్వర్యారాయ్ వంటి హీరోయిన్ కేవలం నాగార్జున కోసమని 'రావోయి చందమామ'లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక టబుతో ఆయనకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆమె హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చినా నాగార్జున ఇంట్లోనే దిగుతానని చెప్పింది. వీరితో పాటు సుస్మితా సేన్ నుంచి సోనాలిబింద్రే వరకు ఎవరైనా సరే నాగ్‌తో చిత్రం అంటే ఎగిరి గంతేస్తారు. ఈ విషయాన్ని స్వర్గీయ అతిలోకసుందరి శ్రీదేవి కూడా ఒకసారి చెప్పుకొచ్చింది. ఇక బాలకృష్ణకి నో చెప్పిన అమితాబ్‌బచ్చన్ అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'లో గెస్ట్‌రోల్ చేశాడు.
ఇక విషయానికి వస్తే తన తోటి నటీనటులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచే నాగార్జున తాజాగా దేశవ్యాప్తంగా అందరు షాక్ అయ్యేలా తీవ్రస్థాయి క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలిబింద్రేకి ధైర్యం చెప్పాడు. 'నీవు తొందరగా కోలుకోవాలి. క్యాన్సర్‌ని జయించాలి. ఆ గొప్ప సంకల్పానికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను డియర్' అని ట్వీట్ చేశాడు. దానికి సోనాలి బింద్రే స్పందిస్తూ 'థాంక్యూ నాగ్'అని సమాధానం ఇచ్చింది. మరోవైపు ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు అందరు సోనాలిబింద్రేకి ధైర్యం చెబుతూ, క్యాన్సర్ నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. మరోవైపు క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలి ప్రతి ఒక్కరికి సమాధనం చెబుతూ రిప్లై ఇస్తూ ఉంది.
ఇక తెలుగులో సోనాలిబింద్రే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు నుంచి శ్రీకాంత్ వరకు చాలామందితో కలిసి నటించింది. కానీ సోనాలి విషయంలో ముందుగా స్పందించింది మాత్రం నాగార్జునే. క్యాన్సర్‌ని జయించాలంటే ఆత్మవిశ్వాసం, సన్నిహితులు, స్నేహితులు అందరి అండ, ధైర్యం ఇచ్చేవారు ఉండాలి. ఆ పనిని నాగార్జున చేసి చూపించాడు. నాగ్ కోరుకున్నట్లుగా సోనాలిబింద్రే క్యాన్సర్‌ని జయించాలని కోరుకుందాం.