గత రెండేళ్లు నుండి టాలీవుడ్ లో సమ్మర్ లో వచ్చిన మూవీస్ ఏమి అంతగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ ఏడాది ఆలా లేదు. 'రంగస్థలం', 'భరత్ అనే నేను', 'మహానటి' సినిమాలు వచ్చి ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించాయి. కానీ సమ్మర్ ముగియగానే బాక్సాఫీస్ డల్లుగా మారిపోయింది. ముఖ్యంగా జూన్ నెలలో వచ్చిన సినిమాలు ఏమి అంతగా ఆడలేదు. ఆ నెలలో నిఖార్సయిన హిట్టు ఒక్కటీ పడలేదు.
అదే పరిస్థితి జూలైలో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నెల కూడా ఏమి అంత ఎగ్జైటింగ్‌గా కనిపించడం లేదు. చిన్న- మీడియం రేంజ్ సినిమాలు ఉన్నప్పటికీ వాటిమీద ఏమి అంతగా అంచనాలు లేవు. అయితే ఆగస్టు నెలలో మళ్లీ బాక్సాఫీస్ వేడి రాజుకోబోతోంది. మంచి క్రేజ్ ఉన్న సినిమాలు ఆ నెలలో రిలీజ్ అవుతున్నాయి.
ముందుగా ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు అడివి శేష్ ‘గూఢచారి’ గా వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ తర్వాత వారంలో అంటే ఆగస్టు 9న దిల్ రాజు సంస్థ నుంచి ‘శ్రీనివాసకళ్యాణం’ రాబోతోంది. దీనిలో నితిన్ - రాశి ఖన్నా హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. అలానే విజయ్ దేవరకొండ - రష్మిక హీరోహీరోయిన్ గా వస్తున్న ‘గీత గోవిందం’ ఆగస్టు 15న షెడ్యూల్ అయింది. విజయ్ సినిమా కాబట్టి దీనిపై కూడా అంచనాలు ఉన్నాయి.
ఇక అదే వీకెండ్లో అక్కినేని నాగచైతన్య సినిమా ‘సవ్యసాచి’ రాబోతోంది. దీనికీ మంచి హైప్ ఉంది. చైతు రెండో సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా కూడా నెలాఖరుకు షెడ్యూల్ అయి ఉంది. ఇలా ఆగష్టులో వరసబెట్టి సినిమాలు రిలీజ్ కి రెడీగా వుండటంతో అంతా ఇప్పటి నుండే ప్లాన్స్ వేసుకుంటున్నారు ఏ సినిమాకు వెళ్ళాలా అని. సో.. ఆగష్టు లో బాక్సాఫీస్ కళకళలాడేలా అవకాశాలైతే పుష్కళంగానే వున్నాయి.