బాహుబలి వచ్చి సంచలన విజయాలను నమోదు చేసి దేశవిదేశాలలో సృష్టించిన ప్రభంజనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం విడుదలై ఇంతకాలం అవుతున్నా ఏదో ఒక రూపేణ ఈ చిత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాహుబలికి చెందిన గేమ్స్, కామిక్‌బుక్స్, అవార్డులు ఇలా దీని అప్రతిహత సాగిపోతూనే ఉంది. ఇక 'బాహుబలి' చిత్రంలోని ప్రతి పాత్రా ఎంతో విలువైనది. ఎంతో ప్రాధాన్యం కలిగిన పాత్రలే ఈ చిత్రం మొత్తం ఉన్నాయి. వీటిలో మరీ ముఖ్యంగా 'బాహుబలి, భళ్లాలదేవ' తర్వాత ఎక్కువగా అందరినీ అలరించిన పాత్రలు 'శివగామి, కట్టప్ప'.
కాగా ఇప్పుడు శివగామి పాత్రను ప్రధానంగా తీసుకుని శివగామి మాహిష్మతి రాజ్యాన్ని ఎలా విస్తరించింది నుంచి భాహుబలి, భళ్లాలదేవ, భిజ్జు వంటి పాత్రల ద్వారా శివగామి మీదనే ఓ వెబ్‌సిరీస్ నిర్మితం కానుంది. అది కూడా అల్లాటప్పా వెబ్ సీరీస్ కాదు. మూడు భాగాలుగా వచ్చేఈ వెబ్‌సిరీస్ కోసం ఏకంగా రూ.375కోట్ల బడ్జెట్‌ని ఖర్చుపెట్టడానికి నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముందుకు వచ్చింది. మాహిష్మతి రాజ్య విస్తరణలో శివగామి పాత్ర ఏమిటి అనే దాని చుట్టు ఈ వెబ్‌సిరీస్ స్టోరీ అల్లుకున్నారట.
దీనికి 'ప్రస్థానం' వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన దేవకట్టా డైరెక్ట్ చేయనుండగా, రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో ఇది సాగుతుందని తెలుస్తోంది. మొత్తానికి ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'శివగామి' వెబ్‌సిరీస్ కూడా తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా వెబ్‌సిరీస్‌ల శకానికి మంచి నాంది పలకుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకరకంగా దీనిని 'బాహుబలి'కి ప్రీక్వెల్‌గా పరిగణించవచ్చు.