పవన్ ఈ మద్యకాలంలో ఎప్పుడు తన కుటుంబసభ్యులు, చిరంజీవి, నాగబాబు, రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్ వంటి వారి ప్రస్తావన వచ్చిన నేను నా బంధువులను ఎవ్వరినీ నాకు మద్దతు ఇవ్వమని కోరను అని చెబుతున్నాడు. మరోపక్క చిరంజీవి తప్ప మిగిలిన మెగాహీరోలందరూ పవన్ పిలిస్తే రావడానికి, ప్రచారానికి కూడా సై అంటున్నారు. అయితే అన్నం వడ్డించే వాడు మన వాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు అన్నసామెత ఉండనే ఉంది. అలాగే పవన్ కుటుంబ సభ్యులైన మెగా ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు బయటకు వచ్చి తమ అభిమానం చూపుకోవాల్సిన పనిలేదు. కేవలం పవన్ వెంటనే ఉండమని తమ అభిమానులకు మూడో కంటికి తెలియకుండా కనుసైగ చేసినా వారందరు పవన్ జెండా పట్టుకోవడానికి ముందుంటారు.
ప్రస్తుతం మెగా కాంపౌండ్ కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినా, లేక పవన్ 'జనసేన' అన్నా కూడా వీరందరి ఆశలు మెగాభిమానుల మీదనే. వారి అండ చూసుకునే వీరు ముందడుగు వేస్తున్నారు. ఇక చిరు ప్రజారాజ్యం స్థాపించినా తన అభిమానులకు చేసింది ఏమీ లేదు. ఈ విషయంలో పవన్ ఇప్పటివరకు తన వైఖరి బయటపెట్టకుండా గుంభనంగా వ్యహరిస్తున్నాడు. అయినా 9వ నెల వచ్చినా కోడలికి కడుపొచ్చిందో లేదో చూడాలంటే వేరే వారి సాక్ష్యం ఎందుకు? ఆమె కడుపు చూస్తే అర్ధమవుతుంది... అన్నరీతిలో పవన్‌కి మెగాభిమానుల మద్దతు ఎలా ఉంది.. అనేది ఆయన సభలకు వచ్చే జనాలు ఎవరో చూస్తేనే అర్దమవుతుంది.
ఒకవైపు పవన్ కూడా చిరు చేసిన తప్పునే చేసున్నాడు. నెల్లూరుకు చెందిన ఒక్క ఓటు లేని మాదాసు గంగాధరంని పార్టీలో చేర్చుకున్నప్పుడే పవన్ దిశ దశ ఎలా ఉంటాయో అర్ధమైంది. ఇక మెగాభిమానులు, మెగాహీరోలకు తప్ప మిగిలిన ఎవరికి తెలియని అరవింద్ రహస్య అభిమాని, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్న స్వామినాయుడు కూడా జనసేన తీర్ధం పుచ్చుకోనుండటంతో ఇక పవన్ మీద వేరే ఆశలేమీ పెట్టుకోవసరం లేదని, ఆయన ఇంకా ప్రజారాజ్యం పార్టీ తానులోని ముక్కే అని స్పష్టమవుతోంది. ఇప్పటికే స్వామినాయుడు.. చిరంజీవి, అల్లు అరవింద్‌లతో మంతనాలు పూర్తి చేసి ఈనెల 9వతేదీన హైదరాబాద్‌లో జరిగే సభ ద్వారా జనసేన జెండా పట్టుకోనున్నాడు. సో.. ఇక పవన్ నాది కులం పార్టీ కాదు.. ప్రజారాజ్యం నాటి తప్పులు పునరావృతం కానివ్వని వంటి ఎన్నిసుద్దులు చెప్పినా ప్రజల్లోకి వెళ్లాల్సిన సంకేతాలు మాత్రం బలంగానే వెళ్తున్నాయి.