మనదేశంలో మతం, మత విశ్వాసాలు అనేది రాను రాను మరింత సున్నితంగా మారుతున్నాయి. ఇప్పుడొస్తున్న సినిమాలలో ఏ సీన్‌లో ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అర్దం కాని పరిస్థితి. మత, కుల నాయకుల్లో సున్నితత్వం పెరిగిన నేపధ్యంలో మనం ముందుకు వెళ్తున్నామా? లేక వెనుక రోజులకు తిరోగమనం చెందుతున్నామా? అనేది అర్ధం కావడం లేదు. నిజానికి నేటి కంటే పాత కాలంలోని ప్రజలే ఎంతో విశాలదృక్పథంతో ఉండేవారు. నేటిరోజుల్లో 'మాలపిల్ల' అనే సినిమా సంగతి సరే.. కనీసం ఆ టైటిల్‌ని కూడా ఒప్పుకుంటారా? ఆపేస్తారా? అనేది అనుమానమే. అసలు సినిమాలో ఏముంది అనేది పట్టించుకోకుండా టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ని, టీజర్‌ని, ట్రైలర్‌ని బట్టే ఆందోళన కారులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆ సీన్, లేదా ఆ టైటిల్ సినిమా కథాంశానికి సరైనదా? కాదా? అనేది చిత్రం విడుదలైతే గానీ తెలియదు. కానీ ఆ నోటా ఈ నోటా విన్నమాటలతో సినిమాలకు ఆదిలోనే బెదిరింపులు చేస్తూ భావప్రకటనా స్వేచ్చకు విఘాతం కల్పిస్తున్నారు.
ఇక ప్రభుత్వాలు, సెన్సార్‌బోర్డ్‌లు కూడా కుల, మత సంఘాలు లేవనెత్తే అభ్యంతరాలకు తానా తందానా అంటున్నాయి. కర్ణిసేనకి చెందిన వారు 'పద్మావత్' విషయంలో చేసిన రచ్చ, ఆందోళన చిన్నచితకా కాదు. ఏకంగా దర్శకుడి తలని నరికి తెస్తే బహుమానం ఇస్తామని, దీపికాపడుకోనే ముక్కు చెవులు కత్తిరించాలని నానా యాగీ చేశారు. కానీ అదే చిత్రం విడుదలైన తర్వాత మన దేశంలో సరే ఓవర్‌సీస్‌లో కూడా రాజ్‌పుత్ మహిళందరు తమ సంప్రదాయ దుస్తులు వేసుకుని, ఏకంగా ఓ థియేటర్‌ని తామే బుక్ చేసుకుని ఆ సినిమా సాగినంత సేపు తమ నృత్యాలతో తమ గొప్పతనాన్ని చాటినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ చిత్రం సాధించిన విజయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా వివాదాలలో చిక్కుకుంటోంది.
జాన్‌అబ్రహం ప్రస్తుతం 'సత్యమేవ జయతే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంపై వెంటనే షియా తెగకి చెందిన ముస్లింలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. ఈ చిత్రంలో షియాల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని, ఈ చిత్రం ట్రైలర్‌లో మెహర్రం పండుగ సంప్రదాయాన్ని తప్పుగా చూపించారని, బిజెపి మైనార్టీ ఫ్రంట్ జనరల్ సెక్రటరీ సయ్యద్ అలీ జాఫ్రీ హైదరాబాద్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ ట్రైలర్ లో మెహర్రం పండుగ నేపధ్యాన్ని తప్పుగా చూపించారని, ట్రైలర్‌లో ఓ సీన్ ఉంది. మెహర్రం రోజున చేసే మాతమ్ అంటే స్వీయదండనను చూపించారు. మాతమ్ తర్వాత ఆ నటుడు హత్యకి పాల్పడతాడు. ఇది మా మనోభావాలను గాయపరుస్తోందని చెబుతూ, ముంబైలోని కేంద్రకార్యాలయానికి తమ అభ్యంతరాన్ని తెలియబరిచాడు. ఈ సీన్‌ని కట్ చేయకపోతే ఆగష్టు15న ఈ చిత్రం విడుదల కానిచ్చే ప్రసక్తేలేదని దాని కోసం దేనికైనా సిద్దం అంటున్నాడు. ఇక ఈయన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మనిషి కాబట్టి ఏమి జరిగినా ఆశ్చర్యంలేదనే చెప్పాలి.