తెలుగులో అద్భుతమైన సినిమాటోగ్రాఫర్లలో సెంథిల్‌కుమార్ పేరు ముందుగా చెప్పాలి. ఆయన పనిచేసిన 'బాహుబలి' చిత్రంలోని ఆయన ఫొటోగ్రఫీ సినిమాకి సగం జీవం పోసింది. ఇక ఈయన తన కెరీర్ ప్రారంభంలో 'ఐతే'వంటి చిత్రాలకు కూడా పనిచేశారు. 'బాహుబలి' ద్వారా దేశవిదేశాలలో పేరు ప్రఖ్యాతులుగాంచిన సెంథిల్ కుమార్ ప్రస్తుతం చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా పరిచయం అవుతున్న 'విజేత' చిత్రానికి పనిచేశాడు. ఈ చిత్రం ఈనెల 12వ తేదీన విడుదలకానుంది.
ఈ సందర్భంగా సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ.. 'ఐతే' నాడు పనిచేసిన రోజులని మరలా 'విజేత' చిత్రం గుర్తుకు తెచ్చింది. ఈ చిత్రం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. మన సాధారణ జీవితంలో జరిగే సంఘటనల్లా 'విజేత' చిత్రం ఉంటుంది. మానవసంబంధాలను, మరీ ముఖ్యంగా తండ్రీకొడుకుల బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇది ఓ మద్యతరగతి కుటుంబం కథ, ప్రతి ఒక్కరు తమ కథగా భావించి బాగా కనెక్ట్ అవుతారు. విజయాలు ఉన్నప్పుడు లేనప్పుడు మన చుట్టూ ఉన్న వారి పలకరింపుల్లో, చూపించే ఆప్యాయతల్లో తేడాలుంటాయి. అదే ఈ చిత్రం కథాంశం. నాకు పెద్ద చిన్న సినిమా అనే తేడా లేదు. ఓ టెక్నీషియన్‌గా నాకు ప్రతి చిత్రం చాలెంజే. కొత్త దర్శకులు కాబట్టి కొన్ని సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటిని స్వీకరించాలా వద్దా అనేది వారిష్టం. బాహుబలి వంటి చిత్రాలు ఎప్పుడురావు. వచ్చినప్పుడే నిరూపించుకోవాలి.
గతంలో బాలీవుడ్ చిత్రాలకు చేయాలని ఉండేది. కానీ నేడు తెలుగులో కూడా ఆ స్థాయి చిత్రాలు వస్తున్నాయి. శంకర్, మణిరత్నం, హిరానీ వంటి వారితో పనిచేయాలి. ఆ తర్వాతే దర్శకత్వం గురించి ఆలోచిస్తాను. సంక్రాంతికి నేను రాజమౌళి గారి ఇంటికి వెళ్ళాను. అప్పుడే సాయి కొర్రపాటి గారు వచ్చి ఈ విజేత కథ గురించి చెప్పారు. తర్వాత కథ విని ఎంతో ఇన్‌స్పైర్ అయి ఒప్పుకున్నాను.. అని చెప్పుకొచ్చాడు.