కిక్, రేసు గుర్రం, ధృవ సినిమాల్తో ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి అందరికి షాక్ ఇచ్చాడు. అందులోను భారీ బడ్జెట్ చిత్రాన్ని దేశంలోని పలు భాషల్లో తెరకెక్కించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. అయినప్పటికీ సురేందర్ రెడ్డి... చిరంజీవి హీరోగా చారిత్రాత్మక కథతో సై రా నరసింహారెడ్డి సినిమాని అద్భుతంగా తీర్చిద్దుతున్నాడు. ప్రస్తుతం సై రా షూటింగ్ పనుల్లో తలమునకలైన సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో చేయబోతున్నాడనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటినుండో వినబడుతుంది.
తాజాగా సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ లిస్ట్ లోకి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వచ్చి చేరాడు. మొన్నటివరకు సురేందర్ రెడ్డి - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన రేసుగుర్రం హిట్ అవడంతో... మరోసారి సురేందర్ రెడ్డితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడనే టాక్ నడిచింది. తాజాగా మహేష్ బాబు తో సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని.. ఇప్పటికే మహేష్ బాబుని కలిసి సురేందర్ రెడ్డి కథ కూడా వినిపించాడని టాక్ మీడియాలో మొదలైంది. గతంలో మహేష్ - సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన అతిధి ప్లాప్ అయ్యింది. ఇక అసలు ఒకవేళ అనుకున్నా అదెలా సాధ్యమవుతుంది. ఎందుకంటే మహేష్, ప్రస్తుతం వంశి పైడిపల్లి తో తన 25 సినిమాని చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్, సందీప్ వంగ సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ఇక మరోపక్క సురేందర్ రెడ్డి సై రా షూటింగ్ లో ఎంత బిజీగా వున్నాడో చెప్పడానికి కూడా కష్టమే. మరి ఉయ్యాలవాడ చరిత్రని చదివి ఆకళింప చేసుకుని... ఆ సినిమా చెయ్యడానికే ఏడెనిమిది నెలల టైం తీసుకున్న సురేందర్ రెడ్డి.. ఆ సినిమాని పట్టాలెక్కించి పూర్తి చెయ్యడానికి... వచ్చే ఏడాది వేసవి అవుతుందని అంటున్నారు. ఇలాంటి టైం లో సురేందర్ రెడ్డి మహేష్ ని ఎలా కలుస్తాడు. కలిశాడే అనుకోండి... కథ చెప్పే తీరిక సురేందర్ కి ఉంది అంటారా...? కథ చెప్పాడే అనుకోండి..? అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనే అంటారా? ఏమో ఈ రూమర్ ఎక్కడ ఆగుతుందో అనేది చెప్పడం కష్టమే.