గొప్పగొప్పవారు కూడా ఏవో చిన్నచిన్న విషయాలు, సంగతుల విషయంలో కాస్త అలసత్వం వహించడం ద్వారా తమకున్న గుడ్‌విల్‌నంతా పోగొట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సమాజంలో ఎంతో మంచి పేరు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా, పలువురికి అడిగింది లేదనకుండా సాయం చేసే దానకర్ణుడిగా, మరీ ముఖ్యంగా వివాదాలు వచ్చిన ఏమాత్రం నోరు జారని నిగ్రహవ్యక్తిగా రజనీకాంత్‌కి ఎంతో పేరుంది. ఇండియన్ సినీ చరిత్రలోనే తాను నటించిన చిత్రం వల్ల బయ్యర్లు నష్టపోతే బయ్యర్లను, నిర్మాతలను తన రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వడం మొదలుపెట్టిన వ్యక్తిగా, తన వల్ల ఎవ్వరూ బాధపడకూడదనే మనస్తత్వం ఉండి, ఎంత పెద్ద ఇండియన్ సూపర్‌స్టార్ అయినా సింపుల్‌గా ఉండే ఆయన్ను చూసి ఎందరో మురిసిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆయనకు అభిమానులుగా మారిన వారిలో ఆయన సింప్లిసిటీ, మంచితనం, ఆయన ప్రవర్తనను చూసి కూడా ఆరాధించే వారు ఎందరో ఉన్నారు.
అలాంటి రజనీ ఓ చిన్న మొత్తం విషయంలో చెడ్డపేరు తెచ్చుకుంటూ ఉండటం బాధాకరం. అందునా ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ అవుతున్న పరిస్థితుల్లో ఇది అతని ఇమేజ్‌కి పెద్ద మచ్చగా మిగిలే ప్రమాదం ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే ఓ ప్రైవేట్ సంస్థకు బకాయి పడిన రూ.6.20 కోట్లు వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు రజనీకాంత్ శ్రీమతి లతా రజనీకాంత్‌ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించింది. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశించిందంటే ఇక దానికి తిరుగు ఉండదు. కానీ లతా రజనీకాంత్ మాత్రం ఆ బకాయిని ఇప్పటివరకు తీర్చలేదు. నాడే ఆమెకి 12 వారాలలో చెల్లించాలని సుప్రీం గడ్డిపెట్టినా కూడా లతా పట్టించుకోలేదు.
2014లోరజనీ 'కొచ్చాడయాన్'(తెలుగులో 'విక్రమసింహ')సినిమా హక్కులను అమ్మే క్రమంలో ఈ మొత్తం పెండింగ్‌లో ఉండిపోయింది. కానీ రజనీ కుటుంబం ఆ మొత్తాన్ని ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో సుప్రీంకోర్టు లతపై మండిపడింది. ఎందుకు బకాయి ఇప్పటివరకు చెల్లించలేదు.?ఎప్పుడు చెల్లించబోతున్నారని ప్రశ్నించి చీవాట్లు పెట్టింది. 2016లో సదరు ప్రైవేట్ సంస్థ ఈ పిటిషన్ వేసింది. 'కొచ్చాడయాన్' పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో తమ భాగస్వామ్యం ఉందని, రూ.10కోట్లు రుణం ఇచ్చామని ఆ సంస్థ అంటోంది. దానికి తగ్గ ఆధారాలు కూడా ఆ సంస్థ వద్ద ఉన్నాయి. అయితే తమకు తెలియకుండానే ఈ చిత్రం హక్కులను లత ఏరోస్ సంస్థకు అమ్మిందని ఆ సంస్థ వాదిస్తోంది.
ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు లతను ఆ మొత్తం చెల్లించమని ఆదేశించినా రజనీ కుటుంబం పట్టించుకోలేదు. ఇక 125కోట్ల బడ్జెట్‌తో భారీ సాంకేతిక విలువతో రజనీ కూతురు సౌందర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యానిమేటెడ్ కంటే అధ్వాన్నంగా ఉండటంతో చిత్రం డిజాస్టర్‌గా నిలిచి భారీ నష్టాలు వచ్చాయి. కూతురి మీద నమ్మకంతో ఏకంగా 125కోట్లు పెట్టుబడి పెట్టి, అందులో 25కోట్లు కూడా రాబట్టలేకపోయిన రజనీ, లతలు వారికి ఎంతో చిన్నదైన ఈ మొత్తం విషయంలో ఇలా ప్రవర్తించడం రజనీ ప్రతిష్టకు మచ్చగానే చెప్పాలి.