తెరపై కనిపించినట్లుగానే నిజజీవితంలో కూడా అలాగే ఉంటారని భావించే సమాజం మనది. కానీ ఇది అందరి విషయాలలో నిజంకాదు. సినీ తెరపై శృంగార తారగా, నర్తకిగా పేరు తెచ్చుకున్న జయమాలినిపై ఆమె కెరీర్ మొత్తంలో ఎక్కడా ఎటువంటి చెడు వార్త, చెడు ప్రచారం రాలేదు. నిజజీవితంలో ఆమె పరాయి మగాళ్ల కళ్లలోకి కూడా చూసి మాట్లాడేది కాదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఇండస్ట్రీలో ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ సెక్స్‌బాంబ్‌గా పేరు తెచ్చుకున్న మల్లికాషెరావత్ కూడా ఇలాంటి విషయాలపైనే తన ఆవేదన వెలిబుచ్చింది.
ఆమె 'మర్డర్' చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయం అయింది. ఈ చిత్రంలో ఆమె లిప్‌లాక్ సీన్స్, పొట్టి పొట్టి దుస్తులతో బోల్డ్‌గా నటించింది. దాంతో ఈమెకి వరుసగా అలాంటి పాత్రలే వచ్చేవి. దానిపై ఆమె తన ఆవేదన తెలిపింది. నాకు ప్రత్యేక గీతాల్లో, బోల్డ్ సీన్స్‌లో గ్లామరస్‌గా నటిస్తుందనే ముద్ర పడటంతో నా టాలెంట్‌ని, నటనాప్రతిభను చూపించే అవకాశం రాలేదు. ఇలాంటి పేరు నాకు రావడానికి దర్శకులు, సహనటులే కారణం. మల్లికా దేనికైనా రెడీ, దేనికైనా రాజీపడుతుందని అనుకునేవారు. 'మర్డర్' తర్వాత ఈమె పొట్టి దుస్తులైనా వేసుకుంటుంది.. ఎలాంటి సీన్స్‌లో అయినా నటిస్తుంది.. అన్ని వదిలేసిన మహిళ అనే పేరు వచ్చింది. సిగ్గులేని మహిళ అని పేరు రావడంతో అందరు నన్ను అదేదృష్టితో చూసేవారు.
నేను తెరపై నటించినట్లుగా తెర వెనుక ఉండను. ఎవరితోనూ చనువుగా ఉండను. తెరపై నటిస్తున్నావు కదా...! మరి నిజజీవితంలో చనువుగా ఉండటానికి నీకేం ఇబ్బంది అని పచ్చిగా అడిగేవారు. దీని వల్ల నన్ను ఎన్నో చిత్రాల నుంచి తీసివేశారు. దీనిని బట్టి మహిళలకు సమాజంలో ఏర్పడుతున్న పరిస్థితులు అర్దం అవుతాయి. కొందరు ఫోన్ చేసి తెల్లవారుజామున 3గంటలకు గెస్ట్‌హౌస్‌కి రమ్మనే వారు. నేను వారు చెప్పినట్లు చేసి ఉంటే ఎన్నో మంచి సినిమాలు వచ్చి ఉండేది. కానీ అవన్నీ మిస్ అయ్యాయి. నేను రాజీపడే అమ్మాయిని కాదు. ఆత్మాభిమానం ఉన్న మహిళను. కానీ ఇలాంటి విషయాలన్నీ బయటికి చెప్పాలంటే భయం.
ఎందుకంటే అందరు ఈ విషయం చెబితే తప్పు నాదేనని నింద వేస్తారు. కొన్నిసార్లు మీడియా కూడా నాకు వ్యతిరేకంగా ఏవేవో రాసేది. ఎంతో బాధపడేదానిని. ఫలానా సీన్లలో ఇలా నటించిందని రాసేవారు. కానీ వాటిని ఏ పరిస్థితిలో చేయాల్సివచ్చిందో ఆలోచించే వారు కాదు. దాంతో అభద్రతాభావానికి లోనయ్యేదానిని. ఓసారి సీనియర్ విలేకరి నాతో తప్పుగా బిహేవ్ చేసి వెకిలివేషాలు వేశాడు. విషయం తెలిసినా నాకు మద్దతుగా ఎవ్వరూ ముందుకు రాలేదు.. అంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది.