నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో ప్రతి దర్శకుడికి ఒక్కో విధానం ఉంటుంది. ఏదైనా కోపం వస్తే దాసరి వంటి వారు కుర్చీలు విసిరిగొట్టేవారు. రవిరాజా పినిశెట్టి వంటి వారు కొట్టేవారు. తేజ కూడా తాను నటీనటుల నుంచి నటనను రాబట్టేందుకు కొడతానని ఓపెన్‌గానే చెప్పేవాడు. మరికొందరు డైరెక్టర్లు సైకోలుగా వ్యవహరిస్తే, మరికొందరు మాత్రం ఎంతో సహనంగా తమకు కావాల్సిన నటనను రాబట్టుకుంటారు. పాతతరంకి చెందిన పుల్లయ్య వంటి దర్శకులు 'లం..కొడకా' అని పిలిచేవారు. కాబట్టి దీనిపై ఎవరు ఎలా ఉండాలి? అనే నియమం ఏమి లేదు.
ఇక తాజాగా కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంజన తాను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? అని బాధపడిన సందర్బాలు ఉన్నాయని చెప్పి సంచలన విషయాలను వెల్లడించింది. 17ఏళ్ల వయసులో నేను ఓ సినిమా చేశాను. ఆ చిత్రం దర్శకుడు నాతో హీరోకి ముద్దు పెట్టించాడు. నేను అలా చేయనని చెబితే నా గురించి చెడుగా ప్రచారం చేస్తానని బెదిరించాడు. ఆ సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్ చూసేందుకు మా అమ్మానాన్న ఎంతో ఇబ్బంది పడ్డారు. కాలేజీలో కూడా నాకు అవమానాలు ఎదురయ్యాయి. నేను ఏమైనా చేసుకుంటానోనని మా అమ్మనాన్న ఎంతో భయపడ్డారు.
ఇక ఆ దర్శకుడు సన్నని, నున్నగా ఉన్న బండపై డూప్‌లేకుండా నాతోనే నడిపించాడు. ఏమాత్రం కాలు జారినా నదిలో పడిపోతాను. అయినా నా గురించి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా అందరి ముందు నన్ను అరిచి, తిట్టి నాచేత అలా చేయించాడు. అలాంటి సైకో డైరెక్టర్‌ని నేనెక్కడా చూడలేదు. అది తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇంత చెప్పిన ఆమె ఆ డైరెక్టర్ పేరును మాత్రం చెప్పకపోవడంతో పలువురు పలువురి పేర్లను ప్రస్తావిస్తున్నారు.