సీనియర్ నిర్మాత, దర్శకుడు, సినీకార్మికులకు అండగా నిలవడంతో పాటు కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో తమ్మారెడ్డి భరద్వాజ ముందుంటారు. చిరంజీవితో సహా సుమన్, భానుచందర్, శ్రీకాంత్, జెడి చక్రవర్తి, సుమంత్.. ఇలా ఆయన పలువురికి కెరీర్ తొలినాళ్లలో పలు అవకాశాలిచ్చారు. ఇక తాజాగా ఆయన తన జన్మదిన వేడుకలను తన అత్యంత సన్నిహితుల మద్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ, బర్త్‌డేలు జరుపుకోవాలని తన స్నేహితులు, సన్నిహితులు ఎప్పుడు అడుగుతుండేవారు. కానీ నాకు బర్త్‌డే వేడుకలు చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే తప్పించుకుని తిరిగేవాడిని. కానీ కిందటి ఏడాది నా పుట్టినరోజు జరిగిన రెండు రోజులకు నాకు అత్యంత బాధాకరమైన సంఘటన జరిగింది. దాంతో ఈఏడాది పుట్టినరోజుకి ఆత్మీయులతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నాను.
చాలా మంది నాకు చిరంజీవితో పడదని, ఆయనకు తనకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ నా బర్త్‌డే రోజున మొదటగా నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపింది చిరంజీవి గారే. నాకు ఇండస్ట్రీనే లోకం. రాజకీయ నాయకులందరితో మంచి పరిచయాలు ఉన్నా ఇండస్ట్రీనే నమ్ముకున్నాను. నేను ఏదైనా ఎప్పుడైనా పరుషంగా మాట్లాడితే అది ఎదుటి వారి మంచి కోసమే. అంతేతప్ప నాకు ఎవరి మీద కోపం లేదు. దేన్నైనా ప్రేమతో జయించవచ్చని నేను నమ్ముతాను.
నాకంటే వెనుక ఇండస్ట్రీకి వచ్చిన వారు నాకంటే బాగా ఎదిగితే సంతోషించే వారిలో నేను మొదటి వాడిని. నా మాటలకు నా మీద కోపం వచ్చికొందరు మాట్లాడటం మానివేశారు. కానీ ఆ తర్వాత నిజం తెలుసుకున్నారు. వారి మంచి కోసమే నేను అలా మాట్లాడుతానని తెలుసుకుని మరలా అందరు నాతోనే ఉన్నారు. నాకు ఇండస్ట్రీ వారందరూ ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు.