అసలు జనసేన అధినేత పవన్ చేసే విమర్శలు చూస్తూ ఉంటే ఆ పార్టీకి అధినేతగా కాకుండా చిన్నపిల్లాడి అపరిపక్వత కనిపిస్తోంది. ఈయన కంటే సామాన్య ప్రజలే మేలు అనిపించడానికి కారణం ఆయన పేరు ఊరు లేకుండా నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తూ ఉండటం. నిన్నటి వరకు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్‌పై ఏవేవో అవినీతి ఆరోపణలు చేశాడు. చివరకు వాటిని సాక్ష్యాలు చూపించమంటే ఎవరో అంటుంటే విన్నానని నవ్వు వచ్చే సమాధానం చెప్పాడు. తిరుమల వెంకన్న నగలను విమానంలో విదేశాలకు తరలించారని ఓ ఐపీఎస్ తనతో ప్రత్యేకంగా చెప్పాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎవరైనా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే అనుమతుల కోసం తమని లంచం అడుగుతున్నారని పలువురు తనతో అన్నారని మరోసారి మాట్లాడాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు.
నిన్నటి వరకు లోకేష్, టిడిపి నాయకులను టార్గెట్ చేసిన ఆయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీదనే విమర్శలు ఎక్కుపెట్టాడు. విశాఖపట్టణంలో జరిగిన భూ కబ్జాలలో మంత్రులు, స్థానిక నాయకులకే కాదు.. చంద్రబాబు హస్తం కూడా ఉందని ఆరోపించాడు. ఇందులో చంద్రబాబు ప్రమేయం ఉన్న సంగతి నాకు తెలుసు అని వ్యాఖ్యానించాడు. మరి ఏకంగా ముఖ్యమంత్రిపైనే అవినీతి ఆరోపణలు చేసే ముందు పవన్ తన వద్ద బలమైన సాక్ష్యాలను పెట్టుకోవాలి. లేదంటే రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని చెబుతున్న పవన్ మాటల మీద అందరికీ నమ్మకం పోతుంది.
మరి పవన్ వద్ద ఆ సాక్ష్యాలు ఉన్నాయా? ఉంటే బయటపెట్టగలడా? అనేది వేచిచూడాల్సివుంది. ఇక టిడిపి వరకు సరే.. పవన్ టిడిపితో కటీఫ్ అయినట్లు భావించవచ్చు. మరి వైసీపీ, బిజెపి,కాంగ్రెస్‌ల పట్ల ఆయన స్టాండ్ ఏమిటి? విశాఖ నుంచి కేంద్రమంత్రిగా చేసి తాజాగా బిజెపిలో ఉన్న పురందేశ్వరి, వైజాగ్ ఎంపీ, బిజెపి నిన్నటి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబులకు ఈ భూకబ్జా విషయం తెలుసా? లేదా? అనేది కూడా పవన్ స్పష్టం చేయాలి!