ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో నాగచైతన్య కూడా ఒక్కో చిత్రం ద్వారా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగిపోతున్నాడు. 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం అతని కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కానీ ఆ తర్వాత ఎన్నో అంచనాలు, ఆశల మధ్య వచ్చిన 'యుద్ధం శరణం' చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తనకి 'ప్రేమమ్' వంటి హిట్‌ని అందించిన చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చిత్రం చేస్తున్నాడు. తెలుగు భాష రాదు కాబట్టి తెలుగులో డైరెక్ట్‌గా నటించనని చెప్పిన మాధవన్ ఇందులో నటిస్తుండటం, మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న మైత్రిమూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
మరోవైపు 'భలే భలే మగాడివోయ్, మహానుభావుడు' వంటి చిత్రాల తర్వాత క్లీన్ చిత్రాలను ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే చిత్రాలను కూడా చేయగలనని నిరూపించుకుని ఊపు మీదున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఆయన 'శైలజారెడ్డి అల్లుడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో చైతూకి అత్తగా రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా హారికఅండ్ హాసిని సంస్థకి చెందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ అంటూ ఫ్యాన్‌మేడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై మారుతి స్పందించాడు. ఈ పోస్టర్ ఒరిజినల్‌కాదని, ఫస్ట్‌లుక్‌ని తాము అఫీషియల్‌గా మరోవారంలో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈరెండు చిత్రాల తర్వాత చైతు తన మేనమామ వెంకటేష్‌తో ఓ చిత్రంతో పాటు 'నిన్నుకోరి' దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వంలో మరోచిత్రంలో నటించనున్నాడు.