మన దక్షిణాది ప్రాంతీయ భాషల కంటే బాలీవుడ్ చిత్రాలకు కాస్త సెన్సార్ వైఖరి చూసి చూడనట్లుగా ఉంటుందనే టాక్ ఉంది. ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ కాస్త విశృంఖలత్వం, సెక్స్, ఎక్స్‌పోజింగ్, ఇతర విషయాలలో సెన్సార్ చూసి చూడనట్లు ఉంటుంది. అలాంటి సెన్సారే ఆ మధ్య వచ్చిన 'ఉడ్తాపంజాబ్' కి చుక్కలు చూపించింది. ఈ చిత్రం పంజాబ్‌లోని డ్రగ్స్ నేపధ్యంలో సాగే చిత్రం.
ఇక విషయానికి వస్తే కోలీవుడ్‌లో నయనతారకి స్టార్ హీరోలకి ఉన్నంత క్రేజ్ ఉంది. హీరో ఎవరైనా సరే నయనతార ఉందంటే చాలు మినిమం గ్యారంటీ ఖాయమని నమ్ముతారు. ఓపెనింగ్స్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. అందునా నయనతార మిగిలిన దక్షిణాది భాషల వారికి కూడా సుపరిచితురాలు కావడంతో డబ్బింగ్‌కి కూడా అనుకూలం. అందుకే కోలీవుడ్‌లో ఈమధ్య ఆమెనే ప్రధాన పాత్రలో తీసుకుని చిత్రాలు తీస్తున్నారు. అలా తెరకెక్కిన చిత్రమే 'కొలమావు కోకిల' దీనికి నెల్సన్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార డ్రగ్స్ స్మగ్లర్ పాత్రను చేస్తోంది.
దీంతో ఈ చిత్రానికి క్రేజ్ పెరిగింది. కానీ సెన్సార్ మాత్రం కఠినంగా వ్యవహరించి 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది. తర్వాత దర్శకుడు కొన్ని సీన్స్ కట్ చేయడంతో 'యు/ఎ' సర్టిఫికేట్ వచ్చింది. కానీ నిర్మాతలు మాత్రం సెన్సార్ వారి ధోరణి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. రివైజింగ్ కమిటీకి వెళ్లి క్లీన్‌యు సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి...!