స్వర్గీయ నందమూరి తారకరామారావు తన తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి కారణం కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అనేది అసలు నిజం. కాంగ్రెస్‌లోని ఈ వారసత్వ రాజకీయాలనే నాడు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి వారిమీద ఎక్కువ టార్గెట్ చేశాడు. అలాంటి ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో సినిమాలలో, రాజకీయంగా కూడా తన వారసునిగా బాలకృష్ణని ప్రకటించి తన ఆశయాలకు తానే తూట్లు పొడిచాడు. ఇక ఎన్టీఆర్ తర్వాత లక్ష్మీపార్వతి, చంద్రబాబు పోరులో చంద్రబాబు విజయం సాధించాడు. ఇక దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ ఇలా నందమూరి ఇంటి వారే టిడిపిని నడిపారు...నడుపుతున్నారు. ఇక చంద్రబాబు మరింత ముందుజాగ్రత్తగా తన కుమారుడు లోకేష్‌ని బాలయ్యకి అల్లుడిని చేసి తన తర్వాత తెలుగుదేశం పగ్గాలు లోకేష్‌కి అందేలా చర్యలు తీసుకుంటూ ఉన్నాడు.
మరోవైపు బాలయ్య కూడా ఎమ్మెల్యేగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే బాలయ్య కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాలలోకి రావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య పెద్ద అల్లుడు లోకేష్ రాష్ట్రమంత్రిగా, చంద్రబాబు తర్వాత పగ్గాలు చేపట్టే నాయకునిగా పావులు కదుపుతున్నాడు. ఇప్పుడు బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని భర్త, బాలయ్య చిన్నల్లుడు అయిన భరత్ వచ్చే ఎన్నికల్లో రాజకీయాలోకి రానున్నట్లు సమాచారం. వాస్తవానికి కిందటి ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ సీటుని టిడిపి బిజెపితో పొత్తులో భాగంగా బిజెపికి ఇచ్చింది. దాంతో నాటి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ప్రతిపక్షనేత జగన్ తల్లి విజయమ్మ మీద విజయం సాధించాడు.
కానీ ప్రస్తుతం బిజెపితో టిడిపికి కటీఫ్ అయింది. ఇక వైజాగ్ నుంచి ఎక్కువగా పరాయి ప్రాంతం వారే నిలబడుతూ ఉంటారు. టి.సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, పురంధరేశ్వరి వంటి వారికి విశాఖ వాసులు పెద్ద పీట వేశారు. దీంతో బాలయ్య చిన్నల్లుడి తండ్రి, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి వచ్చే ఎన్నికల్లో తనకి లేదా తన మనవడికి వైజాగ్ సీటుని ఇవ్వాలని చంద్రబాబుని కోరాడట. మరోవైపు మంత్రి గంటాని ఈసారి వైజాగ్ ఎంపీగా పోటీ చేయించాలని కొందరు సూచిస్తున్నారు. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది.. అయినా రాను రాను టిడిపి మొత్తం కూడా వారసులతో నిండిపోవడం బాధాకరం.