తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎస్వీరంగారావుని మించిన నటుడు రాడు.. రాబోడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్టీఆర్‌కైనా నాడు పోటీ ఉండేది కానీ ఎస్వీఆర్‌కి మాత్రం ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ పరిశ్రమలోని ఓ సామాజిక వర్గం వారు కుట్ర చేసి ఆయనకు తెలుగులో అవకాశాలు రాకుండా చేశారని, దాంతో ఆయన తమిళంలో బిజీ అయ్యారని కొందరు చెబుతారు. అయితే ఆయన తమిళంలో నటించిన చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయాలంటే ఎస్వీఆర్ పాత్రకు ప్రత్యామ్నాయం లభించేది కాదు. దాంతో కొందరు గుమ్మడిని ఆ స్థానంలోకి తెచ్చి, చిన్నవయసులోనే ఆయన చేత ముసలి పాత్రలు వేయించారని ఇండస్ట్రీకి చెందిన వారు చెబుతారు.
ఇక తాజాగా ఎస్వీఆర్ గురించి మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా స్పందించాడు. ఆయన గురించి మాట్లాడే అర్హత, స్థాయి నాకు లేవు. ఆయన సినిమా రంగాన్ని ఏలుతున్న రోజుల్లో నేను ఏడెనిమిది తరగతులు చదువుతున్నాను. మా తండ్రి వెంకట్రావ్ గారు 'జగత్‌జెట్టీలు, జగత్‌కిలాడీలు' వంటి చిత్రాలలో నటించారు. 'జగత్ కిలాడీలు'లో ఆయన ఎస్వీఆర్‌తో కలిసి పనిచేశారు. ఆయన గురించి విశేషాలను నాన్నగారు మాకు చెబుతూ ఉంటే మైమరిచిపోయి వినేవారిమి. ఆపై ఆయన మీద అభిమానం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఆయనతో నటించే అవకాశం కలగకపోయినా ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని ఆశపడే వాడిని. కానీ నేను సినిమాలలోకి రావాలనుకునే సమయానికే ఆయన మరణించారు.
ఎస్వీఆర్‌తో కలిసి నటించాలంటే తోటి ఆర్టిస్టులు భయపడతారు. ఎందుకంటే ఆయన ఒకసారి నటించినట్లుగా మరోసారి నటించరు. ఆయన స్పీడ్‌ని అందుకోవడం ఎవరికైనా కష్టం. అలాంటి మహానుభావుడికి ఏ పురస్కారం రాకపోవడం బాధాకరమైన విషయం. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఇచ్చేలా ఒత్తిడి చేయాలి.. అని చెప్పారు. అయితే ఆయనకు ఫాల్కే కాదు.. నిజంగా భారతరత్న ఇవ్వాలని, ఆయనవల్ల ఆ బిరుదులకే వన్నె చేకూరుతుందని ఎస్వీఆర్ అభిమానుల కోరిక అని చెప్పాలి.