మణిరత్నం మెచ్చిన వారికి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా రాజయోగం తప్పదు. ఈ విషయాన్ని జయాపజయాలకు భిన్నంగా ఎన్నోచిత్రాలలోని నటీనటులు నిరూపించారు. ఇక మణిరత్నం తీసిన 'చెలియా' అనే డబ్బింగ్ చిత్రం ద్వారా ఆదితీరావు హైదరి పరిచయం అయింది. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. కానీ ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం 'సమ్మోహనం'లో ఆమె నటనకు రాజమౌళి నుంచి ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈమె భవిష్యత్తులో తెలుగులో టాప్ హీరోయిన్ కావడం ఖాయమని అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు.
తాజాగా ఆమె ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ 'సమ్మోహనం' వంటి మొదటి చిత్రం ద్వారానే ప్రేక్షకులను ఆకర్షించడం ఎంతో ఆనందాన్ని అందిస్తోందని చెబుతోంది. చాలా థ్రిల్‌గా ఫీలయ్యాను. ఎంతో ఇష్టంతో ఈ పాత్ర చేశాను. ఇక మీరు అంత క్యూట్‌గా ఎలా ఉన్నారు? అని అడిగితే అది మా తల్లిదండ్రుల తప్పు అని నవ్వుతూ ఉన్న ఎమోజీలను పెట్టింది. హిందీ, ఇంగ్లీషు భాషలు వచ్చు. తెలుగు, తమిళం కాస్త కాస్త వచ్చు అని చెప్పుకొచ్చింది.
ఇక మీరుచేసే క్రేజీ పని ఏమిటి? అంటే 'ఎవ్వరూ చూడలేని విధంగా డ్యాన్స్ చేయడమేనని, ఇటీవల తాను కొన్ని తెలుగు చిత్రాలు చూశానని 'పెళ్లిచూపులు, హలో, ఫిదా' చిత్రాలు తనకెంతో నచ్చాయని' చెప్పుకొచ్చింది. నా హాబీలు పాటలు పాడటం, డ్యాన్స్, యాక్టింగ్ చేయడమేనని, ఇక ఎవరి అందమైనా వారి కళ్లలోనే దాగుంటుందని, ఇంతవరకు మీకు ఎంత మంది ప్రపోజ్ చేశారు అని అడగ్గా నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేసింది.