ఎవరైనా దర్శకుడు కావాలంటే మొత్తం 24 క్రాఫ్ట్స్‌లోనూ పట్టు ఉండాలి. ఆ విషయంలో ఏ దర్శకుడికైనా మార్గదర్శకంగా నిలిచే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి. ఈయన మహారాష్ట్రలోని సింధీ కుటుంబానికి చెందిన వాడు. డిగ్రీలో కామర్స్ చదివిన ఈయనను చార్టర్డ్ అకౌంటెంట్‌గా చూడాలని ఇంట్లో వారు ఆశపడ్డారు. కానీ ఆయనకు చిన్ననాటి నుంచి సినిమాలంటే ప్రాణం. ప్రతి చిత్రాన్నిచూసేవాడు. ఓసారి సినిమాలలో చాన్స్ కోసమని ఫొటోసెషన్ దిగి ఆ ఫొటోలను ఓ నిర్మాతకు పంపాడు. కానీ అంతకంటే ముందు నటనలో శిక్షణ అవసరమని పలువురు సలహా ఇవ్వడంతో ఈయన ముంబైలో నటన శిక్షణ కేంద్రంలో చేరాడు.
కానీ పరిస్థితులు అనుకూలించక మూడు రోజుల్లోనే ఆపేశాడు. ఆతర్వాత తండ్రి సలహాలో ఎడిటింగ్ శాఖలో చేరాడు. ఎడిటింగ్ కోర్స్ పూర్తి అయిన తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కానీ అక్కడ కూడా ఆయన పయనం ఎన్నో ఇబ్బందులతోనే కొనసాగింది. దాంతో ప్రకటనల రంగంలోకి వచ్చాడు. ఆయన తీసిన 'ఫెవికాల్' యాడ్స్ ఆయనలోని క్రియేటివిటీని బయటపెట్టాయి. ఈ యాడ్స్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. యాడ్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో ఈయన '1942-ఎ లవ్‌స్టోరీ'కి ప్రోమోలు, ట్రైలర్స్ తయారు చేశాడు. అనంతరం 'కరీబ్' సినిమా ప్రమోషన్లలో కూడా భాగస్వామి అయ్యాడు. ఆయన ఎడిటర్‌గా పనిచేసిన 'మిషన్ కాశ్మీర్' ఆయన జీవితాన్నే మలుపుతిప్పింది. ఆతర్వాత ఆయన తీసిన ఐదు చిత్రాలు సంచలనాలకు వేదికగా మారాయి.
ఇక ఈయన నిర్మాతగా కూడా తన సత్తా, డెసిషన్ మేకింగ్ ఏంటో నిరూపించుకున్నాడు. సుధా కొంగర తమిళంలో తీసిన 'ఇరుద్దిసుత్రు' చిత్రానికి బాలీవుడ్ రీమేక్‌గా 'సాలాఖుద్దూస్' తీశాడు. ఇది ఘన విజయం సాధించింది. ఇదే చిత్రం తెలుగులో 'గురు'గా వచ్చింది. ఇక ఈయన 'ఏక్ లడ్‌ఖీ కో దేఖాతో ఐసాలగా' చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈయనకు సినిమాలోని అన్ని విభాగాలలో ఎంత పట్టుందో ఆయన చిత్రాలలోని ప్రతి ఫ్రేమ్ మనకి తెలియజేస్తుంది.