తెలుగులో గ్లామర్‌తో కాకుండా తనదైన నటనతో మెప్పించిన నిన్నటితరం హీరోయిన్ ఆమని. ఆమె నటనా ప్రతిభకు 'శుభలగ్నం, మావిచిగురు, మిస్టర్ పెళ్లాం, శుభసంకల్పం' వంటి చిత్రాలు అద్దం పడతాయి. నిన్నటి తరంలో సౌందర్య తర్వాత ఆమనిలో మహిళా, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించిన ఘనత ఈమెకే దక్కుతుంది. ప్రతి నటి కలలుగనే బాపు, కె.విశ్వనాథ్, ఎస్వీకృష్ణారెడ్డి వంటి దర్శకులతోనే గాక నిన్నటితరం టాప్ హీరోలందరి సరసన ఆమె నటించింది. అవార్డులతో పాటు రివార్డులు కూడా సొంతం చేసుకుంది. తన రెండో ఇన్నింగ్స్‌లో కూడా 'ఆ...నలుగురు' వంటి చిత్రాలతో తన సత్తా చాటింది. కాగా ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తోంది.
తాజాగా మహేష్‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్ 'భరత్ అనే నేను'లో మహేష్ తల్లి పాత్ర చేసింది. తాజాగా ఈమె మాట్లాడుతూ. హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్న సమయంలో వివాహం చేసుకున్నాను. మా అమ్మ ఇంత మంచి కెరీర్ మరలా ఎంత కష్టపడినా రాదని వారించినా కూడా ఆమె మాట వినలేదు. పెళ్లి తర్వాత మావారు సినిమాలలో నటించకూడదని కండీషన్ పెట్టాడు. దాంతో విలువైన కెరీర్ నాశనం అయింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా నటించిన నాకు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో ప్రాధాన్యం తగ్గిందని తెలుసుకున్నాను.. అంటూ కాస్త ఆవేదనగా చెప్పుకొచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం చాలా ఇబ్బందిగానే ఉంది. పెళ్లయిన తర్వాత సినిమాలలో నటించకూడదని కండీషన్ పెట్టిన మావారి నుంచి ఇప్పుడు అలాంటి కండీషన్లు ఏమీ లేవు.
ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రెండేళ్లు ఎంతో నిరాశగా జరిగాయి. ఫొటోలను చూసి ఓకే అన్నవారు.. చివరకు నన్ను నేరుగా చూసి వద్దనేవారు.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆమని అందరికీ తెలిసింది ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'జంబలకిడిపంబ' ద్వారానే అయినా ఆమె మొదట నటించిన చిత్రం 'ప్రేమే నాప్రాణం' మాత్రం చాలా ఆలస్యంగా విడుదలైంది.