టాలీవుడ్‌లో మనం అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళిని చెప్పుకుంటాం. కానీ రాజమౌళినే మెచ్చే దర్శకుడు మరొకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. రాజ్‌కుమార్ హిరాణి. ఆయన తాజాగా ఖల్‌నాయక్ సంజయ్‌దత్ బయోపిక్‌గా 'సంజు' చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంతో ఈయన మరో సారి బయోపిక్‌లతో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఇక రాజమౌళి తీసేవన్నీ కమర్షియల్ చిత్రాలే గానీ అందులో సామాజిక కోణం కనిపించదు. కానీ రాజ్‌కుమార్ హిరాణి తీసిన ఐదు చిత్రాలు ఆణిముత్యాలే. 'మున్నాబాయ్ ఎంబిబిఎస్'తో వ్యాధులను చికిత్సతో కాకుండా మనసుతో కూడా నయం చేయవచ్చని చెబుతూ, టెలిపతీ నేపధ్యంలో అద్భుతంగా తీశాడు. ఆ తర్వాత చిత్రాన్ని గాంధీగిరిని చూపిస్తూ 'లగే రహో మున్నాభాయ్'ని తెరకెక్కించాడు.
ఇక అమీర్‌ఖాన్ 'త్రీ ఇడియట్స్' ద్వారా నేటి విద్యావ్యవస్థలోని లోపాలు, స్నేహం విలువలను తెలియజేస్తూ మరిపించాడు. అమీర్‌ఖాన్‌తో మరోసారి మత సామరస్యం, దేశభక్తిని జోడించి 'పీకే'ని తీర్చిదిద్దాదు. ఇక తాజాగా సంజయ్‌దత్ జీవితం, ఓటములను ఎదిరించి నిలవడం ఎలా? డ్రగ్స్ బాధితుని నుంచి ఇతర అనేక వ్యసనాల నుంచి యువతకు మంచి సందేశం ఇస్తూ రణబీర్‌కపూర్ హీరోగా 'సంజు'ని తీర్చిదిద్దాడు. తన 15ఏళ్ల కెరీర్‌లో ఈయన తీసినవి కేవలం ఐదే ఐదు చిత్రాలే కావడం విశేషం. నవరసాలను జోడిస్తూనే సందేశం అందిస్తూ ఈయన తీసిన ప్రతి చిత్రం ఓ కళాఖండం. ఇక ఈయన తీసిన 'మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగేరహోమున్నాభాయ్' చిత్రాలు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమిళంలో కమల్‌హాసన్‌తో రీమేక్ అయ్యాయి.
'త్రీ ఇడియట్స్' చిత్రాన్ని ఏకంగా శంకర్ వంటి దర్శక దిగ్గజం తమిళంలో 'నన్బన్'గా, తెలుగులో 'స్నేహితులు' గా వచ్చాయి. మొత్తానికి 'సంజు' తో మరోసారి సంచలనం సృష్టిస్తున్న రాజ్‌కుమార్ హిరాణినీ పలువురు సంజయ్ లీలా భన్సాలీ తర్వాత అంతటి గొప్ప దర్శకునిగా చెబుతున్నారు. కానీ నిజానికి ఆయన సంజయ్‌లీలా భన్సాలీని ఎప్పుడో తన క్రియేటివిటీతో దాటేశాడు. 'సంజు' ముందు తీసిన నాలుగు చిత్రాల ద్వారా ఆయన ఏకంగా వివిధ కేటగిరీల్లో 36 అవార్డులు గెలుపొందాడు. ఆయన చిత్రాలన్నీ దేశ, విదేశాలలో రివార్డులే కాదు ఎవ్వరూ సాధించలేని అవార్డులను కూడా సాధించడం విశేషం.