నితిన్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసి, హీరోగా నిలబెట్టింది తేజ. అయితే తేజ తర్వాత ఆయనకు ఆ స్థాయిలో హిట్‌ని, కమర్షియల్, మాస్ హీరోగా ఆయన కెరీర్‌ని నిలబెట్టిన చిత్రం మాత్రం 'దిల్' అని ఒప్పుకోవాలి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ద్వారా హీరోగా నితిన్‌కి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలక్షణ నటునిగా ప్రకాష్‌రాజ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక దిల్‌రాజుకి కూడా 'దిల్' చిత్రం ఇంటి పేరులా మారింది. అప్పటి నుంచి ఆయన దిల్‌రాజుగా మారాడు. అయితే ఈ చిత్రం ద్వారా దిల్‌రాజుకి భాగస్వామిగా వ్యవహరించిన గిరి మాత్రం ఆ తర్వాత రెండు మూడు చిత్రాలకే తెరమరుగైనా కూడా, దిల్‌రాజు మాత్రం తన విజయపరంపరను అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు.
ఇక విషయానికి వస్తే 'దిల్' చిత్రం 2003లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఒకటిన్నర దశాబ్దం అంటే 15ఏళ్ల అనంతరం మరలా నితిన్ హీరోగా దిల్‌రాజు చిత్రం తీస్తున్నాడు. అదే 'శ్రీనివాసకళ్యాణం'. దిల్‌రాజుకి అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టిన 'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక 'దిల్' చిత్రం తర్వాత దిల్‌రాజుకి విలక్షణనటుడు ప్రకాష్‌రాజ్ ఏకంగా ఆస్థాన నటుడిని మారాడు. మరో పక్క 'దిల్' చిత్రం విడుదల సమయంలో నితిన్ కెరీర్ ఎలా ఇబ్బందుల్లో ఉందో.. ప్రస్తుతం 'లై, చల్‌మోహనరంగ' ప్లాప్స్ తో అలాగే వుంది. సో. నితిన్ కెరీర్‌కి 'శ్రీనివాసకళ్యాణం' అంతే కీలకంగా మారింది.
ఇక నాటి 'దిల్' మ్యాజిక్‌ను మరలా 'శ్రీనివాసకళ్యాణం' రిపీట్ చేస్తుందని నితిన్ ఆశిస్తున్నాడు. ఈ సందర్భంగా నితిన్, దిల్‌రాజు, ప్రకాష్‌రాజ్‌ల కాంబో రిపీట్‌కావడంపై నితిన్ స్పందిస్తూ.. మళ్లీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి 'దిల్' కాంబో వస్తోంది... అని ట్వీట్ చేస్తూ దిల్‌రాజు, ప్రకాష్‌రాజులతో తాను తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు. మరి నితిన్ ఆశ నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది!