'మహానటి' సినిమాను ఏమంటూ ఒప్పుకుందో తెలియదు కానీ ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ సంపాందించని పేరు ఆ సినిమాతో సంపాదించుకుంది కీర్తి సురేష్. ఒకేసారి 20 సినిమాలు చేసిన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమెను వెదుక్కుంటూ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి మరో ప్రెస్టీజియస్ సినిమాలో నటిస్తుందని టాక్. మరోసారి కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించనుంది.
బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ జీవిత కథ చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర చేయనుంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే సావిత్రి, నాగేశ్వరరావులు లేకుండా వుంటారా? అందులోనూ ఆ రెండు పాత్రల నిడివి కూడా కాస్త ఎక్కువే. నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తుండగా.. సావిత్రి పాత్రలో కీర్తిని తీసుకుందాం అనుకుంటున్నారు మేకర్స్. బాలకృష్ణ కూడా సావిత్రి పాత్రకి కీర్తి అయితే ఒకే చెప్పాడని తెలుస్తుంది.
మొదట నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్యని తీసుకుందాం అనుకున్నారు కానీ ఆ పాత్ర చేయడానికి చైతన్య ఒప్పుకోకపోవడంతో సుమంత్ ని తీసుకుంటున్నారు. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రకు, సావిత్రి పాత్రకు మధ్య కీలక సన్నివేశాలు ఉన్నాయట. అందుకోసమే ఆ పాత్రకు కీర్తి అయితే కరెక్ట్ అనుకుని ఆమెను తీసుకున్నట్టు సమాచారం. మహానటి పాత్రను రెండు సార్లు పోషించే అవకాశం రావడం కీర్తికి అదృష్టమే అని చెప్పాలి.