కేవలం తెలుగువారి మదిలో చిరస్థాయిలో నిలబడే చిత్రంగా 'బాహుబలి'ని చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్ర ప్రభంజనం ఇప్పటితో ఆగేట్లు లేదు. దేశంలోనే ఈ ప్రాంతీయ భాషా చిత్రం సాధించిన అద్భుత కలెక్షన్లు ఈ సినిమాకి లభించిన ఆదరణకు ప్రతీకగా చెప్పాలి. ఓ డబ్బింగ్ చిత్రం కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అందరిని నిశ్చేష్టులను చేసే విధంగా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇండియన్ సినిమా పరిస్థితి ఎలా మారిందంటే బాహుబలికి ముందు తర్వాత అన్నట్లుగా చెప్పుకుంటున్నారు.
ఏ భాషలో ఎవరైనా సరే బాహుబలికి మించిన బడ్జెట్‌తో రూపొందే చిత్రాలను కూడా బాహుబలితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక మనదేశంలోనే కాదు.. ఈ చిత్రం విదేశాలలో, జపాన్, చైనాలతో పాటు పలు దేశాలలో మంచి కలెక్షన్లు సాధించడమే కాదు.. పలు అంతర్జాతీయ అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు ఇది సోషల్‌మీడియాలోని ప్రతి అంశంలో రికార్డు వ్యూవర్ షిప్స్‌ని సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది.
తాజాగా బాహుబలికి మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. కాలిఫోర్నియాలో జరిగిన 44వ శాటర్న్ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలవడం విశేషం. ఈ విభాగంలో ఆరు చిత్రాలు పోటీపడితే తుదకు 'బాహుబలి 2' ఈ అవార్డును దక్కించుకుంది. అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, హారర్ ఫిల్మ్స్ అనే సంస్థ ప్రతి ఏటా ఈ అవార్డులను ఇస్తోంది. మొత్తానికి బాహుబలి ప్రభంజనం ఇప్పుడప్పుడే ఆగేలా లేదని మాత్రం చెప్పాలి....!