'జబర్దస్త్'కి ముందే కొన్ని చిత్రాలలో నటించినా కూడా ఈటీవీ 'జబర్ధస్త్' ద్వారా బాగా పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్. ఈయన తాజాగా 'శంభోశంకర' చిత్రంలో హీరోగా నటించాడు. 'ఆనందోబ్రహ్మ' తర్వాత నాకు నచ్చిన పాత్రలు రాలేదు. హీరో అయిపోవాలని ఈ చిత్రం చేయలేదు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఈచిత్రం చేశాను. నాదగ్గర మంచి కథ ఉంది.. దర్శకుడు ఉన్నాడు. దొంగతనం చేయడానికి భయపడాలి గానీ అవకాశం ఇవ్వమని అడిగేందుకు భయం ఎందుకు? అని అనిపించి, ఈ కథతో రవితేజ, దిల్‌రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారి వద్దకు వెళ్లి ఈ సినిమాని నిర్మించమని అడిగాను, వారెవ్వరూ చేయమని అనలేదు. కాస్త టైం పడుతుంది అన్నారు. దాంతో మేమే ఈ ప్రాజెక్ట్ చేశాం.
శ్రీధర్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ చిత్రానికి నేను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా కూడా పనిచేశాను. నేను, శ్రీధర్ కలిసి ఈ కథను తయారు చేశాం. శంకర్ హీరో ఏమిటి? అనుకోవద్దు. ఒక్కసారి కాదు..ఏకంగా పదిసార్లైనా ఈచిత్రం చూస్తున్నంత సేపు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. నిర్మాతలు రమణారెడ్డికి, సురేష్ కొండేటికి కృతజ్ఞతలు. నిన్నటి వరకు అందరికీ ఆర్దికంగా సాయం చేస్తూ వస్తున్నాను. కానీ ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మా ఆవిడ ఈ విషయంలో వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఎక్కడికైనా వెళ్లి వేషం అడుగుదామనుకుంటే అక్కడ పది మంది వెయిటింగ్‌లో ఉంటున్నారు. దాంతో ఎవరిని చాన్స్‌లు అడగలేకపోతున్నాను. హీరోగా చేస్తూనే కమెడియన్ పాత్రలు కూడా చేస్తూ ఉంటాను. నాగచైతన్య హీరోగా రూపొందుతున్న'సవ్యసాచి'లో నటించాను అని చెప్పుకొచ్చాడు. మరి ఈ 'శంభో శంకర' చిత్రం షకలక శంకర్‌కి ప్లస్ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది...!