ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, ఏపీని, తెలంగాణను విడదీయడంలో హైదరాబాద్ కీలకపాత్రను పోషించింది. ఎందుకంటే చంద్రబాబు ముందు చూపు లేకుండా అభివృద్ది అంటే అది కేవలం ప్రముఖులు వచ్చిపోయే రాజధాని అభివృద్దేనని భావించారు. హైటెక్ సిటీ, సైబరాబాద్‌నుంచి అభివృద్ది కేంద్రీకరణ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే జరిగింది. కేవలం టీడీపీ కి చెందిన పలువురు ముఖ్యనేతలకు మాదాపూర్ వైపు ఉన్నభూములకు విలువ వచ్చేలా, మురళీమోహన్ వంటి వారికి సాయపడేలా చంద్రబాబు నాడు వ్యవహరించాడు. పోనీ చేసిన తప్పును ఇప్పుడైనా సరిదిద్దుకుంటున్నాడా? అంటే అది లేదు. ఏపీ అబివృద్ది అంటే అమరావతి, విజయవాడ అభివృద్దే అనే భ్రమలో ఆయన ఇప్పటికీ ఉండటం దురదృష్టకరం. మొదటి నుంచి కూడా అభివృద్ది అంతా అమరావతి చుట్టుపక్కలే కేంద్రీకరించడం వల్ల వైజాగ్, ఉత్తరాంద్ర, కర్నూల్, రాయలసీమ ప్రాంతాల వారిలో ఇప్పటికే నిరసన సెగలు రేగుతున్నాయి.
ఇక విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వచ్చాడు. మరలా ఇంతకాలం తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో కాకుండా వ్యక్తిగతంగా విజయవాడకి వచ్చి కృష్ణమ్మతీరంలో కొలువైన అమ్మలగన్న అమ్మ విజయవాడ కనకదుర్గా దేవిని దర్శించుకుని తన మొక్కులు తీర్చుకున్నాడు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగిన క్షణం నుంచి మరలా ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కి వెళ్లేవరుకు ఆయన వెంట ఉన్న దేవినేని ఉమా అన్ని విషయాలను చూసుకున్నాడు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఒకప్పటితో పోలిస్తే విజయవాడ బాగా అభివృద్ది చెందింది. బందర్‌రోడ్డును బాగా విస్తరించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెయింటింగ్స్ అందంగా ఉన్నాయి. బందరు రోడ్డు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ వరకు గ్రీనరీ చాలా బాగుంది. గన్నవరం విమానాశ్రయం కూడా బాగా అభివృద్ది చెందింది. అమ్మవారి దర్శనం బాగా అయింది. మరోసారి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని వ్యాఖ్యానించారు. అతిధిగా కేసీఆర్ అలా పొగడటం మామూలే కానీ టిడిపి నాయకులు మాత్రం కేసీఆర్‌కి కనిపించిన అభివృద్ది వైసీపీ, జనసేన, బిజెపిలకు కనిపించలేదా? అంటున్నారు. వారి దృష్టిలో రాష్ట్రాభివృద్ది అంటే రాజధాని అభివృద్ది మాత్రమే అన్నట్లుగా ఉంది వ్యవహారం.