మన బడా బడా నిర్మాతలు గతంలో నుంచి నేటి వరకు చేస్తున్న తప్పు ఏమిటంటే.. స్టార్స్ డేట్స్ లభిస్తే దానికి తగ్గట్లుగా ఓ దర్శకుడిని ఎంచుకుని, ఆ హీరోకి అనుగుణంగా ఓ కథను వండివార్చి సినిమాలు తీస్తూ, కాంబినేషన్ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ నిజంగా తెలివి కలిగిన నిర్మాతలు ముందుగా స్టార్ హీరోల వెంట పడకుండా తమ బేనర్‌కి తగ్గ మంచి టాలెంటెడ్ దర్శకులను ఏరికోరి పట్టుకుని, వారి ద్వారా స్టార్స్‌కి కథలు వినిపించి స్టార్స్ డేట్స్‌ని ఈజీగా పొందుతున్నారు.
దీనివల్ల ఆయా నిర్మాతలకు హిట్స్‌శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి కథ, టాలెంటెడ్ దర్శకుడు చేతిలో ఉంటే ఏ స్టార్ అయినా ఓకే చెబుతాడు. మొదటి నుంచి ఇదే దారిలో పయనిస్తున్న టాలెంటెడ్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు. ఆయన దగ్గర పర్మినెంట్ దర్శకులకు లోటు ఎప్పుడు ఉండదు. ఎవరిలోనైనా టాలెంట్ ఉంటే చాలు ఠక్కున పట్టేసి మూడు నాలుగు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంటాడు. తాజాగా దిల్‌రాజు దృష్టి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణపై పడిందట. దాంతో ఆయనకు అడ్వాన్స్‌లు ఇవ్వడమే కాదు...తమ బేనర్‌లో మూడు నాలుగు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఇంద్రగంటి తన కెరీర్ మొదలైనప్పటి నుంచి కేవలం 'బందిపోటు' తప్ప మిగిలిన ప్రతి చిత్రం ద్వారా తన టాలెంట్‌ని నిరూపించుకుంటూనే వస్తున్నాడు.
తాజాగా వచ్చిన 'సమ్మోహనం' చిత్రం ఆయన్ను దర్శకునిగా మరో మెట్టు పైకెక్కించింది. ఇక ఇటీవల మహేష్‌బాబు కూడా ఇంద్రగంటితో ఓ చిత్రం చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని వార్తలు వచ్చాయి. మరి ఇంద్రగంటిని ఎరవేసి దిల్‌రాజు ఏయే హీరోలను తన దారిలోకి తెచ్చుకుంటాడో వేచిచూడాల్సివుంది...!