పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉన్న పలువురు వాటిని మంచికి కాకుండా చెడుకి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ సైబర్ నేరగాడు తెలుగులో క్రియేటివ్ దర్శకుడైన శేఖర్‌కమ్ముల పేరుతో పలువురిని మోసం చేసి అందిన కాడికి దండుకుని జెండా ఎత్తేశాడు.
ఇక విషయానికి వస్తే శేఖర్‌కమ్ముల సాధారణంగా తన సినిమాలలో కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దీంతో ఓ ప్రబుద్దుడు శేఖర్‌కమ్ముల పేరుతో సోషల్‌మీడియాలో కొత్త నటీనటులు కావాలని ప్రకటన ఇచ్చాడు. శేఖర్‌కమ్ముల కొత్తవారికి బాగా అవకాశాల ఇస్తాడనే పేరు ఉండటంతో ఎంతో మంది దీనిని నమ్మారు. ఇలా ఔత్సాహికులైన వారు ఆయన్ను ఓ ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగా, మొదట నాలుగు వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మిగిలిన మొత్తాన్ని ఈనెల 25న నిర్వహించే ఇంటర్వ్యూలో చెల్లించాలని చెప్పాడు. దాంతో ఎందరో ఆయన్ను నమ్మి ఆయన అకౌంట్‌లో రెండువేలు జమచేశారు.
ఇక 25వ తేదీన ఒంగోలుకి చెందిన ప్రదీప్ అనే యువకుడు శేఖర్‌కమ్ములను కలిసి తాను రెండు వేలు డిపాజిట్ కట్టానని, మిగలిన డబ్బు కడతాను.. నన్ను ఇంటర్వ్యూ చేయమని అడిగాడు. దీంతో విషయం తెలిసి అవాక్కయిన శేఖర్‌కమ్ముల నగరానికి చెందిన సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఉదంతం బయటపడింది.