మనదేశంలో లాజిక్కుల కంటే మ్యాజిక్కులకే ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టే మనం సైంటిస్ట్‌ల కంటే స్వామిజీలనే ఎక్కువ నమ్ముతాం అంటూ 'జులాయి' చిత్రంలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు. ఇది అక్షరాలా సత్యం. దేవుడిని నమ్మవచ్చు.. నమ్మకపోవచ్చు.. అది ఎవరికి వారు తీసుకునే నిర్ణయం. కానీ జ్యోతిష్యాలను, ఇతర మూఢనమ్మకాలను నమ్మడం మాత్రం అజ్ఞానం. కానీ అదేం చిత్రమో గానీ మన దేశ ప్రధానులు, రాష్ట్రపతులు కూడా దొంగ బాబాల కాళ్లపై పడి మొక్కుకుంటూ ఉంటే ఇక సామాన్యుల సంగతేమిటి?
ఇక విషయానికి వస్తే మీడయా కూడా ఇలాంటి వాటిని హైలైట్ చూస్తూ టీఆర్పీలు, సర్క్యులేషన్ కోసం తాపత్రయ పడిపోతుంటారు. దాంతో భవిష్యత్తుని చెబుతామని పలువురు బయలుదేరుతుంటారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ జ్ఞానేశ్వర్ అనే జ్యోతిష్కుడు వాగిన నానా చెత్తను ఓ ప్రముఖ దినపత్రిక ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం విస్తుగొలిపే అంశం. ఆయన మాట్లాడుతూ, రాబోయే కాలంలో అమితాబ్‌బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ప్రధాని అవుతారట. అభిషేక్‌బచ్చన్-ఐశ్వర్యారాయ్‌ల కుమార్తె ఆరాధ్యబచ్చన్‌కే ఆ అవకాశం ఉందని కానీ ఆమె ప్రధాని కావాలంటే పేరును రోహిణిగా మార్చాలని సూచించాడు.
ఇక తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు వచ్చి రజనీ సీఎం అవుతాడని అంటున్నాడు. భారత్, పాకిస్థాన్ మధ్య 2024లో యుద్దం వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు గెలుస్తారని చెబుతున్న ఆయన గతంలో నేను చెప్పినవన్నీ జరిగాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాను. అదే జరిగింది. చిరంజీవి, రజనీకాంత్‌లు రాజకీయాలలోకి వస్తారని చెప్పాను. అది కూడా నిజమైంది. నేను చెప్పేవన్నీ జరగడం తధ్యం అంటున్నాడు.